చితికి పేర్చే కట్టెలను అడ్డుకున్న ఫారెస్టు ఆఫీసర్

  • Published By: madhu ,Published On : February 24, 2019 / 09:10 AM IST
చితికి పేర్చే కట్టెలను అడ్డుకున్న ఫారెస్టు ఆఫీసర్

అడవిలో చెట్లు ఎవరు నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఫారెస్టు ఆఫీసర్స్ కూడా అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ ఆఫీసర్ చేసిన పనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చితి పేర్చడానికి కట్టెలు తీసుకెళుతున్న వ్యక్తిని ఎలా అడ్డుకుంటారని..దాడి ఎందుకు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట చల్వాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

చల్వాయి గ్రామంలో ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం ఓ వ్యక్తి చనిపోయాడు. ఇతని అంత్యక్రియల కోసం కట్టెలు తీసుకరావడానికి సార్ల సారయ్యతో పాటు కొంతమంది అడవికి వెళ్లారు. కట్టెలు తీసుకొని వస్తుండగా ఫారెస్టు బీట్ ఆఫీసర్ కిరణ్ కుమార్ వారిని అడ్డుకున్నారు. కట్టెలు తీసుకెళ్లవద్దని హుకుం జారీ చేశాడు. ఆఫీసర్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలో సార్ల సారయ్యపై కిరణ్ కుమార్ దాడి చేశాడని, తమపై దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఫారెస్టుకు సమీపంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.