తనను 16సార్లు అరెస్ట్ చేసిన పోలీసుకు కిడ్నీ దానం చేసిన లేడీదొంగ

  • Published By: nagamani ,Published On : September 14, 2020 / 05:21 PM IST
తనను 16సార్లు అరెస్ట్ చేసిన పోలీసుకు కిడ్నీ దానం చేసిన లేడీదొంగ

తనను 16 సార్లు అరెస్ట్ చేసిన పోలీసుకు కిడ్నీ దానం చేసి ప్రాణాలు కాపాడింది ఓ లేడీ దొంగ. దొంగా-పోలీసు నడుమ జరిగిన ఈ ఆసక్తికర సన్నివేశం చాలా వింతగా మారింది. ఆ దొంగా పోలీసుల కథ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దొంగ-పోలీస్ కథలు చాలానే విన్నాం. సినిమాల్లోను చూశాం. నిజ జీవితంలో కూడా దొంగ-పోలీస్ కథలు జరుగుతుంటాయి.అలాంటిదే అమెరికాలోని అలబామాలోని ఓ లేడీ దొంగ పోలీసుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆమె తరచూ దొంగతనాలు చేయటం..ఆమెను చాకచక్యంగా పట్టుకుని స్టేషన్ లో పెట్టటం ఇదే ఇద్దరి మధ్యా జరుగేది. ఆ లేడీ దొంగ పేరు ‘జోసెలిన్ జేమ్స్’, ఆ పోలీస్ పేరు ‘టెర్రెల్ పాటర్’. ఆమె చోరీలు చేయటం..పోలీసు పట్టుకుని లోపలేయటం..అలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 16సార్లు జోసెలిన్ ను పట్టుకున్నాడు పాటర్. దీంతో పాటర్ అంటే ఆమెకు ఒళ్లుమంట.


ఓ దొంగలేడీ అంటే ఆ పోలీసుకు విసుగొచ్చేసింది. ‘సిగ్గు లేదా.. ఎన్నిసార్లు బొక్కలో వేసిన నువ్వు మారవా? దొంగతనాలు మానవా? అంటూ తెగ తిట్టేవాడు. నీకో మంచి జీవితం ఉంది ఈ మత్తుమందులకు అలవాటై బంగారాంటి జీవితాన్ని కోల్పోతున్నావు..ఇకనైనా మారు మంచిగా బతుకు అని పదే పదే చెప్పేవాడు. కానీ మత్తుకు బానిసైన ఆమెకు ఇవేవీ తలకెక్కేవి కాదు…నీకు మాత్రం బుద్దిలేదా? ఎన్నిసార్లు పట్టుకుంటావు నన్ను అంటూ ఎదురు దాడికి దిగేదామె. మత్తుపదార్ధాలకు అలవాటు పడిన జోసెలిన్ డబ్బుల కోసం దొంగతనాలు చేసేది. ఉద్యోగం కూడా పోగొట్టుకుంది. దొంగలా మారింది. ఈ క్రమంలో పాటర్ ఆమెను 2007 నుంచి 2012 వరకూ జోసెలిన్ ను పాటర్ 16సార్లు అరెస్ట్ చేశాడు. జైలుకు పంపగా శిక్షలు కూడా అనుభవించింది.


ఈ క్రమంలో జోసెలిన్ ఒక రోజు తన ఫేస్‌బుక్‌‌లో పోలీస్ అధికారి టెర్రెల్‌ పాటర్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకుంది. ఆయనకు అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (మార్పిడి) చేయాలని..ఎవరైనా దాతలు ఉంటే దయచేసి సహాయం చేయాలని ఆ పోస్టులో చూసింది. ఆ పోస్ట్ చేసిన మహిళ పాటర్ కూతురని తెలుసుకుంది. వెంటనే జేమ్స్ ఆమెను కలిసింది. పాటర్‌కు కిడ్నీని దానం ఇస్తానని తెలిపింది. దీంతో అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆమె కిడ్నీ సెట్ అవుతుండటంతో వాండెర్‌బిల్ట్‌ యునివర్సీటీ మెడికల్‌ హెల్త్‌ సెంటర్‌లో పాటర్‌కు విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. అలా జోసెలిన్ పట్టువదలని విక్రమార్కుడిలా తనను 16సార్లు అరెస్ట్ చేసిన పోలీసుకు కిడ్నీ దానం చేసి ప్రాణాలు కాపాడింది. సర్జరీ నుంచి కోలుకుని దొంగ-పోలీసు.. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు.


ఆ తరువాత జోసెలిన్ కు మనిషి ప్రాణం ఎంత విలువైందో తెలుసుకుంది. దాంతో జోసెలిన్ లో మార్పు వచ్చింది. జీవితంలో అన్నీ బంధాలను తెంచుకుని మత్తుమందులకు బానిసైన ఆమెలో మార్పు వచ్చింది. ఈ మత్తువల్లనే కదా..తన ఉద్యోగం పోయింది..ఇంటికి దూరం అయ్యింది. కారు అన్నీ పోయాయి..చివరికి దొంగగా ముద్ర పడింది. టీవీలో మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో తన ఫోటో, పేరును చూసుకుని షాక్ అయ్యింది. ఛీ..ఇదా నా జీవితం అనుకుంది.

దీంతో ఆమె డ్రగ్‌ అడిక్షన్‌ సెంటర్‌కు వెళ్లి తొమ్మిది నెలలు అక్కడే రీహాబిటేట్‌గా మార్చుకుంది. ఇక అప్పటినుంచి జోసెలిన్ జీవితం పూర్తిగా మారిపోయింది. జోసెలిన్ ఇప్పుడు తనలాగే డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న మహిళలను రక్షించే పని చేస్తోంది.


కాగా..జోసెలిన్ కిడ్నీ ఇచ్చి కోలుకున్న తరువాత పాటర్ మాట్లాడుతూ.. ‘నా అనుకున్నవారు ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అలాంటిది ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా 16 సార్లు ఆమెను అరెస్ట్ చేసి, జైలుకు పంపించాను. అయినా ఆ అమ్మాయి వచ్చి నాకు కిడ్నీ దానం చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె అలా మారుతుందని అస్సలు ఊహించలేదు. ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత మళ్లీ నాకు కనిపించలేదు. ఆమె కాంటాక్ట్‌ నంబర్ కూడా నా దగ్గర లేదు. కానీ దేవుడు మా ఇద్దరిని ఈ విధంగా కలుపుతాడని అస్సలు ఊహించలేదు’ అంటూ టెర్రెల్‌ భావోద్వేగంతో తెలిపాడు. జీవితం ఎన్నో నేర్పిస్తుంది. మంచిగా మారే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అలాగే జోసెలిన్ కూడా మంచిగా మారింది. మానత్వానికి ప్రతీకగా నిలిచింది. దీంతో జోసెలిన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.