సీఎం జగన్‌కు గంటా లేఖ : సిట్ నివేదిక బయటపెట్టాలి

  • Edited By: madhu , September 7, 2019 / 09:43 AM IST
సీఎం జగన్‌కు గంటా లేఖ : సిట్ నివేదిక బయటపెట్టాలి

విశాఖ భూ కుంభకోణాల వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వం సిట్ వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వేడి చల్లరలేదు. అప్పటి ప్రభుత్వం సిట్ నివేదిక బయట పెట్టకపోవడం.. ఇప్పటి ప్రభుత్వం మరో సిట్‌ను నియమించడం..ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటా శ్రీనివాసురావు.. ఏకంగా సీఎం జగన్‌కే లేఖ రాయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విశాఖ భూ కుంభకోణాలపై సిట్ నివేదికను బయట పెట్టాలని గంటా పేర్కొనడం చర్చనీయాంశమైంది. నాలుగు రోజులు క్రితం మంత్రి అవంతి..గంటాను ఉద్దేశించి భూకబ్జాదారుడు అంటూ విమర్శలు చేశారు. అప్పుడు అయ్యన్నపాత్రుడు.. ఇప్పుడు అవంతి..గంటాని టార్గెట్‌ చేసిన క్రమంలో ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గంటా అకస్మాత్తుగా లేఖ రాసి.. సిట్ నివేదిక బయటపెట్టమని కోరడం వెనక ఆంతర్యం ఏమిటన్నది తెలియడం లేదు. 

తనపై ఆరోపణలకు ఈ విచారణతో పుల్ స్టాప్ పడుతుందనే ధీమాతోనే గంటా లేఖ రాశారా..? లేక వైసీపీలోకి వెళ్లాలని ఆలోచనతోనే ఇలా చేశారా..? కుంభకోణంలో గంటా పాత్ర లేదా..? ఆయన మనస్సులో ఆంతర్యం ఏమిటన్నది హాట్ టాపిక్ అయ్యింది. 

విశాఖలో వేలాది ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని కలకలం రేపిన సంగతి తెలిసిందే. 2017లో అప్పటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గుర్తించి ప్రభుత్వానికి ఆధారాలతో సహా సమర్పించారు. వాటి విలువ లక్ష కోట్లు ఉంటుందని అంచానా వేశారు. దీంతో విశాఖ నగరం ఉలిక్కిపడింది. భూ కుంభకోణంపై పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. అప్పటి ప్రతిపక్ష నేత.. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్..స్వయంగా విశాఖ నడిబోడ్డున ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.

అప్పటి ప్రభుత్వం ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి సిట్‌కు మొత్తం 2 వేల 8 వందల 75 ఫిర్యాదులు అందాయి. అందులో 12 వందల 59 కేసులు భూ ఆక్రమణలకు సంబంధించినవే ఉన్నాయి. మరో 912 ఫిర్యాదులు కూడా భూ వివాదాలకు సంబంధించినవే. వీటిపై సిట్‌ దర్యాప్తు చేసి జనవరి 2018లో నివేదిక సమర్పించింది. ఈ నివేదిక అప్పటి ప్రభుత్వం బయటపెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా గంటా శ్రీనివాసురావు రాసిన లేఖ కాక పుట్టిస్తోంది. 
Read More : జగన్ 100 రోజుల పాలన : అభివృద్ధి నిల్..సంక్షేమం డల్ – లోకేష్