రాజధాని కాకపోయినా : మరో రూపంలో దొనకొండను వరించిన అదృష్టం

ప్రకాశం జిల్లా దొనకొండ పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. 2014లో రాజధాని అవుతుందంటూ న్యూస్‌ హెడ్‌ లైన్స్‌కి ఎక్కింది. ఆ అవకాశం ఇక లేదని తేలిపోయింది. కాని, మరో

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 06:52 AM IST
రాజధాని కాకపోయినా : మరో రూపంలో దొనకొండను వరించిన అదృష్టం

ప్రకాశం జిల్లా దొనకొండ పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. 2014లో రాజధాని అవుతుందంటూ న్యూస్‌ హెడ్‌ లైన్స్‌కి ఎక్కింది. ఆ అవకాశం ఇక లేదని తేలిపోయింది. కాని, మరో

ప్రకాశం జిల్లా దొనకొండ పేరు మరోసారి తెరమీదకు వస్తోంది. 2014లో రాజధాని అవుతుందంటూ న్యూస్‌ హెడ్‌ లైన్స్‌కి ఎక్కింది. ఆ అవకాశం ఇక లేదని తేలిపోయింది. కాని, మరో రూపంలో దొనకొండను అదృష్టం వరిస్తోంది. మునుపటి ఎయిర్‌ పోర్ట్‌తో సహా డిఫెన్స్‌ క్లస్టర్‌ రాబోతున్నాయి. దీంతో దొనకొండ వాసులలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 

2014లో అవకాశం వచ్చినట్టే వచ్చి వెనక్కు:
బ్రిటీష్ కాలంలోనే అతిపెద్ద రన్‌వేతో విమానాశ్రయం ఉన్న ప్రాంతం దొనకొండ. ఆ తరువాత ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. 2014లో అవకాశం వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లిపోయింది. ఇన్నాళ్లకు దొనకొండ పరిసర ప్రాంత ప్రజలు పరవశించిపోయే ప్రకటన వచ్చింది. అదే డిఫెన్స్‌ క్లస్టర్‌. రక్షణ, విమానయాన రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు దొనకొండలోని విమానాశ్రయంలో ప్రత్యేక సెజ్‌ ఏర్పాటు చేయబోతున్నారు. దొనకొండ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ డిఫెన్స్ క్లస్టర్‌ పెట్టబోతున్నామంటూ లక్నోలో జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో మంత్రి గౌతంరెడ్డి ప్రకటించడంతో ప్రకాశం జిల్లావాసులు తెగ సంబరపడిపోతున్నారు. 

ఐదేళ్లుగా ఊరిస్తున్న కల:
దొనకొండలో డిఫెన్స్‌ క్లస్టర్‌ కోసం గతంలో అధికారులు, కేంద్ర బృందాలు సర్వేలు చేశాయి. కాని, ఆ తరువాత ఎటువంటి పురోగతి లేదు. ఈ మధ్య రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఏపీఐఐసీ చేపట్టిన కీలక సమావేశంలో మళ్లీ డిఫెన్స్‌ క్లస్టర్ ప్రస్తావన వచ్చింది. దొనకొండపై రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ సర్కార్‌ తెలిపింది. దీంతో ఐదేళ్లుగా ఊరిస్తున్న కలలను వైసీపీ ప్రభుత్వమైనా చేతల్లో చూపించి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఉడాన్‌ పథకంలో దొనకొండ ఎయిర్‌పోర్ట్:
దొనకొండ విమానాశ్రయాన్ని ఉడాన్‌ పథకంలో చేర్చి మళ్లీ వినియోగంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. 2014లో దొనకొండ విమానాశ్రయ ప్రాంతాన్ని కేంద్ర ఎయిర్‌ పోర్టు అథారిటీ బృందం పరిశీలించింది. హైదరాబాద్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల బృందం స్ధానిక అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దొనకొండ చేరుకొని పూర్తిస్ధాయిలో పరిశీలించి వెళ్లారు. ఏడాదిన్నర క్రితం రన్‌వే ఏర్పాటు కోసం.. ఢిల్లీ ఏరోనాటికల్‌ సర్వే విభాగం వారం రోజులు పూర్తిస్థాయిలో సర్వే చేశారు.

దొనకొండలో ప్రత్యేక సెజ్‌ తో మంచి రోజులు:
దీంతోపాటు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ కూడా దొనకొండ విమానాశ్రయ స్థల సేకరణ, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఏమైందో గాని అప్పటి నుంచి చప్పుడు లేదు. మొన్న పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ చేపట్టిన సమావేశంలో దొనకొండలో ప్రత్యేక సెజ్‌ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకోవడంతో విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

దొనకొండకు అతి చేరువలో కృష్ణపట్నం, చెన్నై పోర్టులు:
దొనకొండలో డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు అవసరమైన భూమి వేల ఎకరాల్లో ఉండటం, అనువైన ప్రాంతంగా కావడంతో క్లస్టర్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పడినట్లైతే రక్షణరంగ ఉత్పత్తుల తయారీ సంస్థలు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు, ఇతర ఏరో స్పేస్‌ పరిశ్రమలు అక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. దీంతో దొనకొండకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు దొనకొండ అనువైన ప్రాంతమని, కేంద్రానికి ఏపీ ప్రభుత్వం వివరాలతో కూడిన నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా దొనకొండకు అతిచేరువలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులకు మంచి అవకాశాలున్నాయని అందులో తెలిపినట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి.