ఆపడం అసాధ్యం : కోడి కత్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 05:34 AM IST
ఆపడం అసాధ్యం : కోడి కత్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సంక్రాంతి అంటే సంబరాల పండుగ. ముచ్చటగా మూడు రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఊరూవాడ పండుగ శోభ కనిపిస్తుంది. కుటంబసభ్యులు అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే పందెపు రాయుళ్లకు కూడా పండగే. తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేల జోరు మొదలవుతుంది. కోడి పుంజుల పోరు కనిపిస్తుంది. కోర్టులు, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెం రాయుళ్లు ఏ మాత్రం తగ్గరు. పుంజులను పోటీలకు దించుతారు, పందేలు కాస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పందేలకు సిద్ధమయ్యారు.

సంక్రాంతి పందెం కోడి విడుదలకు సిద్ధమైంది. కమాన్ అంటూ కత్తి కట్టి తొడకొడుతోంది. పోలీసులు నో అని వార్నింగ్‌లు ఇస్తున్నా పందెం రాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేసులు పెడతామని హెచ్చరించినా డోంట్ కేర్ అంటున్నారు. ఏకంగా ప్రభుత్వమే పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ప్రజాప్రతినిధులే బెట్టింగ్ బంగార్రాజుల్లా మారడంతో ఈ మూడు రోజులు ‘కోడి కత్తి’ని ఆపడం పోలీసులకు అసాధ్యమే.

కోడి కత్తితో పోలీసులు పరేషాన్:
కోడి కత్తి కట్టింది. సమరానికి సై అంటోంది. తొడ కొట్టి సవాల్ విసురుతోంది. నీ పతాపమో నా పతాపమో చూసుకుందాం రా అని కత్తులు నూరుతోంది. కోడి పందేలు ఆడితే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించినా పందెం రాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్నికల ఏడాది కావడం, రాజకీయ నాయకులే నిర్వాహకులు కావడంతో వారిని పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. చివరకు చూసీచూడనట్లు లైట్ తీసుకుంటున్నారు. అయితే ఖాకీలను కోర్టు నోటీసులు టెన్షన్ పెడుతున్నాయి. పందేలు నిర్వహిస్తుంటే మీరేం చేస్తున్నారిని కోర్టులు ఎక్కడ క్లాస్ పీకుతాయోనని
వర్రీ అవుతున్నారు.

ఎన్నికల ఏడాది కావడంతో:
ఎలక్షన్ ఇయర్ కావడంతో కోడి పందేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజకీయంగా రాణించాలంటే కోడి పందేలకు అడ్డంకులు చెప్పకూడదని పలు జిల్లాల నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారని, దీంతో సర్కారు వీరికి లోపాయికారిగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. 2018లో కోడి పందాలు అడ్డుకుంటామంటూ నెలరోజుల ముందు నుంచే పోలీసులు హెచ్చరికలు చేయడంతోపాటు ముందస్తు దాడులు, కత్తులు కట్టే వారిపై బైండోవర్‌ కేసులు పెట్టి కట్టడిచేసే ప్రయత్నాలు చేశారు. అయినా, పందేలు ఆగకపోవడంతో పోలీసులు, అధికారులు న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వాటిని ఎందుకు అడ్డుకోలేకపోయారో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు.

అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు:
కోడి పందేలు కాసే బెట్టింగ్ బంగార్రాజులు, పందేలను చూసేందుకు వచ్చే గెస్టుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచాలు, సోఫాలు, మందు, మంచింగ్ ఇలా సకలం సిద్ధం చేశారు. రాజకీయ నేతల ప్రవేశంతో కోడి పందేలు రాజకీయ రంగు పులుముకున్నాయి. విస్తృతంగా ప్రచారం నిర్వహించి పబ్లిక్‌గానే పందేలు నిర్వహిస్తున్నారు. పలుకుబడి ఎక్కువగా ఉన్న చోట ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తెల్లవార్లు పందేలు నిర్వహిస్తున్నారు.