వీడియో: ప్రసంగిస్తూనే పడిపోయిన సీఎం రూపానీ

10TV Telugu News

గుజరాథ్ సీఎం విజయ్‌ రూపానీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార వేదికపై నుంచి ప్రసంగిస్తూనే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా రూపానీకి కళ్లు తిరిగాయి. భద్రతాసిబ్బంది, బీజేపీ నేతలు గమనించి పట్టుకునేలోపే రూపానీ కుప్పకూలిపోయారు. హుటాహుటిన ప్రథమ చికిత్స అందించి, విమానంలో అహ్మదాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం రూపానీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. కొన్ని రోజులుగా వరుస ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో సీఎంకు సరైన విశ్రాంతి లేదని, రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. ఒక్కరోజే మూడు బహిరంగ సభల్లో పాల్గొనడంతో నీరసించి వేదికపైనే కుప్పకూలిపోయారని చెప్పారు. బీపీ తగ్గి, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్లే ఆయన కుప్పకూలారని అధికారులు తెలిపారు.

గుజరాత్‌లో కీలకమైన ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 28న మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, తాలూకా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సీఎం విజయ్‌రూపానీ. రూపానీని పరీక్షించిన డాక్టర్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి సమస్యా లేదని వైద్యులు తెలిపారు.

10TV Telugu News