కర్నూలులో దంచి కొడుతున్న వానలు : జలదిగ్బంధంలో మహానంది

  • Published By: madhu ,Published On : September 18, 2019 / 02:25 AM IST
కర్నూలులో దంచి కొడుతున్న వానలు : జలదిగ్బంధంలో మహానంది

కర్నూలు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షం కర్నూలు జిల్లాను ముంచెత్తుతోంది. ఎన్నడూ లేనివిధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని పంచలింగాలు పూర్తిగా మునిగిపోయాయి. మహనంది క్షేత్రం చుట్టూ నీరు ప్రవహిస్తుంది. ఈ సీజన్‌లోనే అధిక శాతాన్ని నమోదు చేసింది. వాగులు, వంకలు పొంగిపొర్లేంతగా, పరిసర ప్రాంతాలను ముంచెత్తేలా వర్షం కురుస్తోంది. కర్నూలు జిల్లాలో నల్లమల అడవులకు ఆనుకుని ఉన్న నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. 

భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మహానంది.. నీట మునిగింది. మహానంది ఆలయం దాదాపు సగం వర్షపు నీటిలో మునిగిపోయింది. గర్భగుడి సమీపం వరకూ వర్షపునీరు చేరుకుంది. ఆలయంలోని కోనేరు పూర్తిగా నిండిపోయి రోడ్లపైకి నీరు ప్రవహిస్తోంది. మహానంది గ్రామంలో ఎటు చూసినా మోకాలి లోతు వరకు నీరు నిల్వ ఉండటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. 

భారీ వర్షాల కారణంగా మహానందీశ్వరుడి దర్శనాలను రద్దు చేశారు ఆలయ అర్చకులు. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మంటపం, కోనేరు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. 

కర్నూలు జిల్లాలోని శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరసానిపాడు, కోవెలకుంట్ల మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 200మిల్లీమీటర్లకు పైగా వర్షపాత నమోదైంది. తమడపల్లె గ్రామం వద్ద రాళ్లవాగు, గాజుల పల్లె సమీపంలోని పాలెరు వాగు పొంగిపొర్లుతుండడంతో నంద్యాల నుంచి మహానందికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నంద్యాల డివిజన్‌లోని ఏడు మండలాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సంజామల మండలం ముదిగేడు వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగులో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 15 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో వర్షం కురిసింది.

భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నల్లగట్ల-బత్తులూరు గ్రామాల మధ్య కడప-కర్నూలు జాతీయ రహదారి కోతకు గురైంది. సిరివేళ్ళ, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 
Read More : అన్వేషణ : లభించని బోటు..21 మృతదేహాల వెలికితీత