రాయలసీమ జిల్లాలను ముంచెత్తున్న వరద

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 08:57 AM IST
రాయలసీమ జిల్లాలను ముంచెత్తున్న వరద

వాన చుక్క కోసం వేయి కళ్లతో ఎదురు చూసే రాయలసీమ ఇప్పుడు వరదలతో అల్లాడుతోంది. వర్షాలు వద్దు బాబోయ్ అంటోంది. వర్షాకాలంలో అన్ని ప్రాంతాలల్లోను కురిసే వాన రాయలసీమలో మాత్రం.. కురిసామా..వెలిసామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వద్దన్నా సరే విడిచిపెట్టను చెత్తుతానంటోంది.రాయలసీమలో
జిల్లాలైన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. నదీ తీర ప్రాంతాలను వరదనీరు  చుట్టు ముట్టింది. దీంతో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లుతున్నారు. గొడ్డు..గోదా..పిల్లా జెల్లా..ముసలీ ముతకా అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు రామయసీమ జిల్లాలో నెలకొంది. 

కన్నీటి కర్నూలు 
కర్నూలు జిల్లాలో వరదలకు ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుడులు, బడులు,ఇళ్లు ఇలా అన్నింటిని వరద నీరు ముంచేసింది. నంద్యాల, మహానంది, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, సిరివెళ్ల, గోస్పాడు, కోవెలకుంట్ల తదితర మండలాలలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. పంటలు నీట మునగిపోవటంతో రైతన్నలు  కన్నీటి చెలమలవుతున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు స్కూళ్లకు  సెలవు ప్రకటించారు. ఎక్కడికక్కడ వైద్య
శిబిరాలను ఏర్పాటున అధికారులు  సహాయక చర్యలు చేపట్టారు. 

భారీ వర్షాలకు నంద్యాల అతలాకుతలమైంది. వాగులు, పంట కాల్వలు పొంగి పొర్లాయి. పంటలు మునిగిపోయాయి.  రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం (సెప్టెంబర్ 17) వరకు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు, నల్లవాగు పొంగిపొర్లడంతో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. నిద్రలేచి చూసుకునేసరికిగా ఇళ్లన్నీ నీటితో నిండిపోయాయి.

నీట మునిగిన మహానంది 
భారీ వర్షాలకు కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం ఎప్పుడూ లేని వింతగా చోటుచేసుకుంది. నంద్యాల శివయ్య చెంతకు గంగమ్మ కదలి వచ్చి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దేవాలయం బైట ఉన్న రెండు కోనేర్లలో నీరు పెల్లుభుకుతోంది. రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల మేరకు  నీరు చేరింది.

ఇలా ఎప్పుడూ జరగలేదని అర్చకులు ఆశ్చర్యపోతున్నారు. శివయ్య చెంద గంగమ్మ చేరటంతో భక్తులకు స్వామిదర్శనం కరవైపోయింది. వరదనీటిలోనే వెళ్లి మహానందీశ్వరస్వామి, కామేశ్వరి అమ్మవార్లకు అర్చకులు అభిషేకార్చనలు నిర్వహిస్తున్నారు. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహానంది- నంద్యాల,మహానంది- ఒంగోలు జాతీయరహదారుల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్‌పై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

కడప జిల్లాలో వర్షాలు..వరదలో కొట్టుకుపోయిన ఆటో..ముగ్గురు గల్లంతు   
కడప జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు కుందూ, పెన్నా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రొద్దుటూరు కామనూరు సమీపంలో కందూ ప్రవాహంలో ఓ ఆటో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారు. పలు మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటనీటిపాలైంది. రోడ్డేదో..చెరువేదో తెలియటంలేదు. 

పులివెందుల సిటీలో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పలు మండలాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.మరోపక్క అనంతపురం జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా చేరుకుంటోంది.