ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకు హైకోర్టు నోటీసులు

  • Published By: vamsi ,Published On : November 21, 2019 / 03:39 AM IST
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకు హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెల్లుబాటు కాని కుల ధ్రువీకరణ పత్రంతో ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారంటూ దాఖలైన పిటిషన్‌‌ను విచారించిన కోర్టు ఆమెకు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. పుష్ప శ్రీవాణి కొండ దొరగా చెప్పుకుని ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందారని, అది చెల్లుబాటు కాదని, ఆమె ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు పిటీషనర్. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది.

2019ఎన్నికల్లో ఆమెపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎన్‌.సింహాచలం.. బీజేపీ అభ్యర్థి ఎన్‌.జయరాజు హైకోర్టులో ఈ పిటిషన్లను వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీవాణి కొండదొరగా చెప్పుకుని, కులధ్రువీకరణ పత్రం సమర్పించారని, అయితే కొండ కులం ఎస్టీగా నోటిఫై కాలేదంటూ వాళ్లు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇద్దరు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై విచారణ జరపి ఆమెకు నోటీసులు జారీ చేసింది కోర్టు.

పుష్ప శ్రీవాణి తండ్రి పాముల నారాయణమూర్తి శ్రీకాకుళం జిల్లా టీడీ పారపురం గ్రామానికి చెందిన వారని.. తర్వాతి కాలంలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామానికి వలస వెళ్లారని పిటీషన్‌లో ప్రస్తావించారు పిటీషనర్లు. శ్రీకాకుళం జిల్లా టీడీ పారపురంలోని ఎంపీపీ పాఠశాల రిజిస్టర్‌లో శ్రీవాణి తండ్రి నారాయణమూర్తి కులం కొండగా నమోదైందని, వారిది కొండకులం అన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో1 పుష్ప శ్రీవాణి విజయనగరం జిల్లా కురుపాం(ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలవగా.. ప్రస్తుతం ఆమె జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.