రాప్తాడులో టెన్షన్ : పరిటాల శ్రీరామ్‌ని అడ్డుకున్న వైసీపీ

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 05:16 AM IST
రాప్తాడులో టెన్షన్ : పరిటాల శ్రీరామ్‌ని అడ్డుకున్న వైసీపీ

ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో..ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈవీఎంలు మొరాయిస్తుండడం..పలు కేంద్రాల్లో టీడీపీ – వైసీపీ వర్గాలు ఘర్షణ పడుతున్నాయి. దీనితో టెన్షన్ నెలకొంది. రాప్తాడు నియోజకవర్గంలో మరూర్ పోలింగ్ కేంద్రంలోకి పరిటాల శ్రీరామ్..తన 50 మంది అనుచరులతో వెళ్లడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు.

ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరునొకరు నెట్టుకున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలను శాంతింప చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు. పరిటాల వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు, వృద్ధులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయలేదు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. టెంట్లు వేయకపోవడంతో ఎండకు తాళలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ఓటర్లు.