పులివెందుల పందేలు : లోకేష్, చంద్రబాబు కలిసినా జగన్‌ను తగ్గించలేరా?

  • Published By: vamsi ,Published On : April 23, 2019 / 09:47 AM IST
పులివెందుల పందేలు : లోకేష్, చంద్రబాబు కలిసినా జగన్‌ను తగ్గించలేరా?

సరిగ్గా నెలరోజులు.. ఎన్నికల ఫలితాల ప్రకటనకు ఉన్న గడువు. వచ్చే నెల(మే) 23వ తేదీన ప్రధాని ఎవరో.. ముఖ్యమంత్రి ఎవరో తేలబోతుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఏ పార్టీ వస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది. అనే విషయమై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పోటీ చేస్తున్న కడప జిల్లా పులివెందులలో కూడా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ బెట్టింగ్‌లు జరిగేది మెజారిటీ మీద మాత్రమే. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతపై జగన్ భారీ మెజారిటీ తెచ్చుకుంటారని విపరీతంగా బెట్టింగ్ వేస్తున్నారు పందెం రాయుళ్లు.

కడప జిల్లా పులివెందుల వైఎస్ కుటుంబానికి అడ్డా. 1978 నుంచి ఆ కుటుంబమే ఇక్కడి నుంచి నెగ్గుతూ వస్తుంది. వైఎస్ మరణం తర్వాత వైసీపీ పార్టీ ద్వారా జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో 75వేల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు టీడీపీ తరుపున వైఎస్ కుటుంబాన్ని ఢీకొంటున్న సతీశ్ రెడ్డి ఈసారి కూడా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. జనసేన తరపున తుపాకుల చంద్రశేఖర్ ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ సంక్షేమ పథకాలు, సతీశ్ రెడ్డి పోరాట తీరుపై ప్రజలు కొంత సానుకూలంగా ఉన్నా.. జగన్ మెజారిటీ తగ్గదు అని అక్కడి నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో జగన్‌కి లక్షా 24వేల 576 ఓట్లు రాగా, సతీశ్ రెడ్డికి 49వేల 333 ఓట్లు వచ్చాయి. మెజార్టీ 75వేలు ఉంది.

అయితే ఇక్కడి మెజార్టీ గురించి ఇప్పుడు బెట్టింగ్‌లు ఎలా జరుగుతున్నాయంటే.. కుప్పంలో చంద్రబాబు మెజార్టీ కంటే మించి ఇక్కడ సాధిస్తాడు అనేదానిపై బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తుండగా.. చంద్రబాబు కంటే జగన్ గత ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు పందెం రాయుళ్లు జగన్‌ మెజార్టీని చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ మెజార్టీతో కలిపి పందాలు కాస్తున్నారట. వీరిద్దరి మెజార్టీ కలిపిన కూడా జగన్ అంత మెజార్టీ రాదని.. జోరుగా పందాలు కాస్తున్నట్లు చెబుతున్నారు.

1989లో చంద్రబాబు కుప్పం నుంచి కేవలం 6,918 మార్జిన్‌తో గెలుపొందారు. 1999లో ఆయన మెజారిటీ 66,000 కాగా 2004లో 59వేల 588 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  2009లో కుప్పంలో 46వేల 066 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. 2014లో 47వేల 121 మెజార్టీతో చంద్రబాబు గెలిచారు.