కన్నీళ్లు ఆగవు : అనంతపురంలో ఆకలి చావు.. అన్నం లేక మట్టి తిని చిన్నారి మృతి

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 03:39 PM IST
కన్నీళ్లు ఆగవు : అనంతపురంలో ఆకలి చావు.. అన్నం లేక మట్టి తిని చిన్నారి మృతి

అనంతపురము : మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. భారత్‌ను చూసి ప్రపంచ దేశాలు కుళ్లకుంటున్నాయి. గ్రహాలపైకి రాకెట్లు పంపుతున్నాము. డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇదంతా నాణానికి ఒకవైపు. కడుపుకి పిడికెడన్నం దొరక్క మనిషి పిట్టలా రాలిపోతున్నాడు. ఆకలికి అలమటించి మట్టి తిన్న చిన్నారి అనారోగ్యంపాలై కన్నుమూసింది. అనంతపురం జిల్లా కదిరి మండలంలో ఈ ఆకలిచావు నమోదైంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించింది. తినడానికి అన్నం లేక.. మట్టి తిని అనారోగ్యం పాలైంది. చివరికి కన్నుమూసింది. మూడు రోజుల క్రితం(ఏప్రిల్ 29,2019) జరిగిన ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

కర్ణాటక రాష్ట్రం గుదిబండ గ్రామం నుంచి మహేష్, నీలవేణి దంపతులు… పదేళ్ల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి వచ్చి స్థిరపడ్డారు. కూలీనాలి చేసుకుని జీవించే వీరికి ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. వేసుకోవడానికి దుస్తులు లేవు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. ఏడాది కిందట ఒక పాప అనారోగ్యంతో చనిపోయింది. 3 రోజుల క్రితం రెండేళ్ల వయసున్న మరో పాప ఆకలికి తట్టుకోలేక మట్టి తిని అనారోగ్యానికి గురై చనిపోయింది. తాముంటున్న గుడారం పక్కనే పాప మృతదేహాన్ని మహేష్ దంపతులు పూడ్చి పెట్టారు.

మహేష్‌కు ఎప్పుడో ఓసారి మాత్రమే కూలి పని దొరుకుతుంది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. ఇల్లు లేకపోవడంతో పిల్లలు రాత్రిపూట వీధుల్లో పడుకుంటున్నారు. పగలు ఎండవేడిమికి తట్టుకోలేక చెట్ల కింద ఉంటున్నారు. ఆకలి తీర్చేవారి కోసం ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఏడాది పాపకు ఏడవడానికి కూడా శక్తి లేదు. బాలల హక్కులను కాపాడడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చెబుతుంటారు. ప్రభుత్వం బాలల హక్కుల చట్టాలను అమలు చేస్తోందా అన్న ప్రశ్న ఈ పిల్లలను చూస్తే కలుగుతుంది.  

మహేష్‌ కుటుంబ దీనావస్థను స్థానికుల ద్వారా తెలుసుకున్న కదిరి రూరల్‌ ఎస్‌ఐ వెంకటస్వామి చలించిపోయారు. ఆ కుటుంబానికి ఉండడానికి… ఒక గదిని తన సొంత డబ్బుతో నిర్మిస్తానని ముందుకు వచ్చారు. అలాగే చైల్డ్‌ లైన్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసులు నాయుడు కూడా స్పందించారు. మహేష్‌ పిల్లల్లో ముగ్గురు ఆరోగ్యరీత్యా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని… వారిని జిల్లా కేంద్రంలోని వసతి గృహంలో ఉంచి… మెరుగున వైద్యం, విద్య అందించే ఏర్పాటు చేస్తానని అన్నారు.