హుజూర్ నగర్ పోలింగ్ : గరిడేపల్లిలో మొరాయించిన EVM..నిలిచిపోయిన పోలింగ్

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 05:41 AM IST
హుజూర్ నగర్ పోలింగ్ : గరిడేపల్లిలో మొరాయించిన EVM..నిలిచిపోయిన పోలింగ్

తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. గరిడేపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో  పోలింగ్ నిలిచిపోయిది.  ఉత్సాహంగా ఓట్లు వేయటానికి వచ్చిన ఓటర్లు లైన్లలోనే నిలిచిపోయారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా..సోమవారం (2019, అక్టోబర్ 21) ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా..ఓట్లు వేయటానికి ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 302 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు మహిళా అభ్యర్థులతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వృద్దులు, వికలాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఈ ఎన్నికలో 1500 మంది సిబ్బంది పాల్గొన్నారు. 79 సమస్యాత్మక కేంద్రాలు ఈసీ గుర్తించింది. 7 మండలాల్లో 302 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లున్నారు. హుజూర్ నగర్ సీటు దక్కించుకోవటానికి ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి.

ఓటర్ ఎటువంటి తీర్పునిస్తాడోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ పార్టీలు అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. కంచుకోటను కాపాడుకొనేందుకు కాంగ్రెస్, తొలిసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరి ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడో తెలుసుకోవాలంటే అక్టోబర్ 24వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.