సీఎం, సీఎస్ మధ్యలో IASలు : అగ్నిపరీక్షలా ఏపీ కేబినెట్ మీటింగ్

  • Published By: madhu ,Published On : May 8, 2019 / 03:43 PM IST
సీఎం, సీఎస్ మధ్యలో IASలు : అగ్నిపరీక్షలా ఏపీ కేబినెట్ మీటింగ్

ఆంధ్రప్రదేశ్‌లో IAS అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఛీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరులో.. అధికారులు నలిగిపోతున్నారు. ఎవరికి ఊ  కొట్టాలో.. ఎవరికి ఉహూ.. చెప్పాలో తెలియక.. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. నిన్నటి వరకు సీఎం సమీక్షలు.. ఐఏఎస్ అధికారులకు పరీక్షలుగా.. మారితే, ఇప్పుడు కేబినెట్ మీటింగ్….అగ్నిపరీక్షలా తయారైంది. 10 వ తేదిన క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని, సీఎంవో నుండి సీఎస్‌కు నోట్ అందింది. 10వ తేదిన క్యాబినెట్ మీటింగ్ సాధ్యం కాదని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తేల్చి చెప్పడంతో చివరకు అది 14వ  తేదికి వాయిదా పడింది. సీఎంవో నుండి వచ్చిన నోట్‌లో పేర్కొన్న అజెండా అంశాలను సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఎన్నికల కోడ్ క్రిందకు వచ్చే వాటిని సీఈసీకి పంపించనున్నారు.

ఎన్నికల కోడ్  క్రిందకు రాని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి అజెండాలో చేర్చాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలదే. కోడ్‌ కిందకు రాని వాటిని కూడా ఈసీకి పంపితే చంద్రబాబుతో మాట పడాల్సి వస్తుందని అధికారులు భయపడుతున్నారు. ఈ విషయంలో ఇంటి పెద్దగా వ్యవహరించాల్సిన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఐఏఎస్ అధికారులకు సహకరించి తగిన సలహాలు, సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ఏవైనా తేడాలుంటే భూతద్దంతో వెతికే పనిలో ఉన్నారాయన. మూడు రోజుల క్రితం ఎల్వీ సుబ్రమణ్యంకు మద్దతుగా రిటైర్డ్ సీఎస్‌లు ఐవైఆర్ క్రిష్ణారావు, అజయ్ కల్లాం ఆధ్వర్యంలోని ఐఏఎస్‌లు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు ఈ భేటీ కొనసాగింది.

గతంలో ఎల్వీ సుబ్రమణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోషియేషన్ సమావేశం కాగా కనీసం కోరం కూడా లేకపోవడంతో వాయిదా వేశారు. అసోషియేషన్ సమావేశానికి వెళితే తాము చంద్రబాబుకు టార్గెట్ అవుతామని పలువురు ఐఏఎస్ లు మీటింగ్ కు హాజరు కాలేదు. ఏం మాట్లాడినా తమను ఏదో ఒక వర్గంలో చేర్చుతారని వీరు భయపడుతున్నారు. జరుగుతున్న పరిణామాలపై కనీసం ఆఫ్ ది రికార్డు కూడా మాట్లాడేందుకు ఐఏఎస్‌లు సాహసించడం లేదు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే రేపు మళ్లీ బాబే సీఎం అయితే ఇబ్బందులు వస్తాయి. పోనీ సీఎస్‌కు వ్యతిరేకంగా వెళదామా అంటే రేపు వైసీపీ వస్తే సమస్యలు తప్పవు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఐఏఎస్‌లు తలపట్టుకుంటున్నారు. చంద్రబాబు, ఎల్వీ ప్రసాద్ మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఎంతమాత్రం కనిపించడం లేదు. దీనితో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు తమకు ఈ తిప్పలు తప్పవని ఐఏఎస్ అధికారులు వాపోతున్నారు.