పొంచివున్న ముప్పు : సాగర్ జలాలపై యురేనియం ప్రభావం

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 02:43 PM IST
పొంచివున్న ముప్పు : సాగర్ జలాలపై యురేనియం ప్రభావం

నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిసరాల్లో యురేనియం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పెద్దగట్టు – నంభాపురం ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అటామిక్ మినర్స్ డైరెక్టర్ ఇచ్చిన నివేదక సంచలనం రేపుతోంది. పెద్దగట్టు – నంభాపురం పరిసరాల్లో గతేడాది 25బోరు బావుల్లో నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. 

21శాంపిల్స్‌లో అత్యంత ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే దశాబ్ద కాలంగా పెద్దగట్టు గ్రామస్తులు భూగర్భ జలాలను తాగునీటికి వినియోగించడం లేదు. కేవలం వ్యవసాయానికి మాత్రమే వాటిని వినియోగిస్తున్నారు. 

అటు నంభాపురం నుంచి 8కిలోమీటర్ల పరిధిలో నీటి నమూనాలను అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ సేకరించింది. దాదాపు 8నెలల పాటు శాంపిల్స్ సేకరించి జరిపిన పరీక్షల్లో యురేనియం స్థాయి 2వేల168 పీపీబీ ఉన్నట్లు నిర్ధారించింది. సాధారణంగా 30పీపీబీలకు మించి ఉన్న నీటిని తాగేందుకు వినియోగించకూడదు. అలాంటిది అక్కడి నీటిలో యురేనియం స్థాయి 2వేలకు పైగా ఉండడం అధికారులను సైతం కలవర పెడుతోంది. యురేనియం.. నాగార్జున సాగర్ జలాల్లోకి విస్తరించే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.