భోగ భాగ్యాల ”భోగి” : మంటల వెనుక మర్మం

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 02:19 AM IST
భోగ భాగ్యాల ”భోగి” : మంటల వెనుక మర్మం

తెలుగు ప్రజలకు అతిపెద్ద పండగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే ఈ పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును ‘భోగి’ అంటారు. భోగి ప్రాశస్త్యంపై 10టీవీ కథనం..

సంక్రాంతి అంటేనే సంబరాల పండగ. తెలుగు ప్రజలు మూడు రోజులపాటు ఆనందంగా జరుపుకునే వేడుక ఇది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడురోజులూ తెలుగు లోగిళ్ళలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ మూడు రోజుల పండగలో తొలి రోజు చేసుకునే భోగి పండగది ప్రత్యేక స్థానం. పాతకు స్వస్తి చెప్పి.. కొత్తకు ఆహ్వానం పలుకుతూ భోగి రోజున ఉదయాన్నే భోగిమంటలు వేస్తారు.  పిడకలు, చెట్లు, తాటాకులతోపాటు.. ఇంట్లోని పాత వస్తువులను కూడా మంటల్లో వేస్తారు. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండగ అని పెద్దలు చెబుతారు.

భోగి పండుగకు చిన్నారులకు తలపై రేగుపళ్ళు పోయడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే.. శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయన్నది ప్రజల విశ్వాసం. పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపొతుందని కూడా నమ్ముతారు. పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని కూడా విశ్వసిస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.

సంక్రాంతిని సూర్యుడి పండగగా భావిస్తారు కాబట్టే.. సూర్యడి ఆశీస్సుల కోసం భోగిపళ్ళు పోస్తారు. పన్నెండేళ్ళ లోపు పిల్లలందరికీ తలపై భోగి పండ్లను పోస్తుంటారు. ఇదీ భోగీ పండుగ ప్రాశస్త్యం. మీరు కూడా ఆనందంగా భోగీ పండుగను జరుపుకోండి మరి.

* తెలుగు ప్రజలకు అతిపెద్ద పండగ సంక్రాంతి
* గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలతో సంబరాలు
* హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలతో పండగే పండగ
* ఆనవాయితీగా వస్తున్న భోగిపళ్ళ సంప్రదాయం