Makar Sankranti 2024: సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటో.. పండుగ రోజున ఏమేం చేస్తారో తెలుసుకుందామా?

Makar Sankranti 2024: సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Makar Sankranti 2024

డూ..డూ.. బసవన్నల ఆటపాటలు, ముంగిట్లో ఇంద్ర ధనుస్సును నిలిపే రంగవల్లులు.. నోరూరించే పిండి వంటలు, కొత్త లుక్ ఇచ్చే సంప్రదాయ దుస్తులు.. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండగ శోభ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి ఘనంగా పండుగను జరుపుకుంటున్నారు. తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సొంతూరికి వచ్చి సంక్రాంతి జరుపుకుంటారు. అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు. సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటి.

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. అందుకే మనకి సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి. వాటిలో విశేషమైంది పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలంతోపాటు సంక్రాంతి సంబరాలూ మొదలవుతాయి. ఈ నెలరోజులూ పెళ్లికాని యువతులంతా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, కళ్లాపి చల్లి, అందమైన రంగవల్లులతో వాకిలి నింపేస్తారు. వాటిమీద ఆవుపేడతో ముద్దలు చేసి, పసుపు, కుంకుమలు పెట్టి, గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలను పెడతారు.

సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు చేస్తారు. అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. సంక్రమణానికీ.. పితృ తర్పణాలు ఇవ్వాలి. మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వక పోయినాసరే, మకర సంక్రమణానికి తప్పకుండా ఇస్తారు.

గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ.. దాని ముందు డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా ఆ గంగిరెద్దులు తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.

కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యం ఇస్తాము. ఇక హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా, చేతుల్లో చిడతలు కొడుతూ తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవ్వడం ఈ పండుగ స్పెషల్‌.

సంక్రాంతి మూడు రోజులు ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. ఈ పండుగకు అత్తారింటికి వచ్చే కొత్త అల్లుళ్లను మరదళ్లు ఆట పట్టిస్తుంటారు. సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు, ఎడ్లబండ్ల పందాలు స్పెషల్ అట్రాక్షన్.

Makar Sankranti 2024: భోగి పండ్ల ప్రాముఖ్యత