మూడు రాజధానుల రగడ :పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన..మా బిడ్డల బతుకు ఏం కావాలి?

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 05:44 AM IST
మూడు రాజధానుల రగడ :పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన..మా బిడ్డల బతుకు ఏం కావాలి?

ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సీఎం ప్రకటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పురుగుమందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలనీ..రాజధాని అమరావతి ప్రాంతమైన వెలగపూడి, రాయపూడి, మందడం, కృష్ణాయపాలెం పురుగుల మందు డబ్బాలతో ధర్నా చేపట్టారు. మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము ఈ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటం తప్ప వేరే దారిలేదని వాపోతున్నారు.

ఈ ఆలోచన అమలు జరిగితే తమ జీవితాలు సర్వనాశనం అయిపోతాయనీ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ ఇంటి ఆడబిడ్డలకు రాజధాని ప్రాంత భూములను పసుపు-కుంకుమ కింద ఇచ్చామని సీఎం మూడు రాజధానుల నిర్ణయంతో తమ బిడ్డల భవిష్యత్తు అంధకారమైపోతుందని వాపోతున్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి జరిగితే తమ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుటుంటందనే ఆశతో తాము జీవిస్తున్నామని ..ఏపీకి సీఎంలు మారినంత మాత్రాన ఏదో చిన్న విషయం అన్నట్లుగా రాజధానుల్ని మార్చేస్తారా? మీ రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? అంటు ప్రశ్నిస్తున్నారు అమరావతి ప్రాంతంలోని రైతన్నలు.

మరావతిని అభివృద్ధి చేయటం మానివేసి..కేవలం సమావేశాలకు..విమర్శలకు మాత్రమే పరిమితం చేస్తున్నారనీ..మూడు రాజధానుల ఆలోచన మానివేసి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెలగపూడి ప్రధాన కూడలిలో ధర్నా చేపట్టిన రైతులు ఏపీకి మూడు రాజధానుల ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్ గా విశాఖపట్నం, జ్యుడిషియల్‌ క్యాపిటల్ గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్ గా అమరావతి ఉండొచ్చు అంటూ సీఎం జగన్ మంగళవారం (డిసెంబర్ 17) ప్రకటించిన విషయం తెలిసిందే.