జగన్ జన్మలో సీఎం కాలేడు

  • Published By: veegamteam ,Published On : April 16, 2019 / 03:10 PM IST
జగన్ జన్మలో సీఎం కాలేడు

అమరావతి : వైసీపీ చీఫ్ జగన్ జన్మలో సీఎం కాలేరని టీడీపీ నేత కోడెల శివప్రసాద రావు అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు, వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు. మహిళలు టీడీపీకే ఓటేశారని  కోడెల చెప్పారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే వారు జగన్ కు ఓటేయరు అని అన్నారు. ఆంధ్రులను అవమానించిన కేసీఆర్ తో జగన్ ఎలా కలిశారు అని కోడెల ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎన్నో అరాచకాలకు  పాల్పడ్డారని మండిపడ్డారు.

ఇనిమెట్ల ఘటనపై ఏర్పాటు చేసిన వైసీపీ నిజనిర్దారణ కమిటీపై కోడెల మండిపడ్డారు. తప్పు చేసి సిగ్గుపడకుండా, నిజనిర్ధారణ కమిటీ అడుగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన ఘటనపై ప్రజలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని కోడెల డిమాండ్ చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇన్ని దుర్మార్గాలు చూడలేదన్నారు. తనపై దాడి చేసిన వారికి ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని కోడెల అన్నారు. టీడీపీకి-వైసీపీ.. తనకు అంబటి రాంబాబు పోటీనే కాదన్నారు. వైసీపీ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని కోడెల అన్నారు. అసెంబ్లీకి రాని వాళ్లు జీతం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. జగన్ వెనకుండి  నడిపిస్తున్న శక్తులను నిలదీయాలన్నారు. జగన్ ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉంటారని కోడెల విమర్శించారు. జగన్ తన ప్రవర్తన మార్చుకోకపోతే రాజకీయ నాయకుడిగానూ పనికిరాడని కోడెల అన్నారు. ఇనిమెట్ల ఘటనలో పోలింగ్ బూత్ లోని సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే ఎవరు తప్పు చేశారో తేలుతుందని కోడెల చెప్పారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల ఘటనలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఏప్రిల్ 11న పోలింగ్ రోజున కోడెల.. పోలింగ్ బూత్ ఆక్రమణకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెలను 7వ నిందితునిగా చేర్చారు. కోడెలతో పటు మరో 22మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోడెలపై దాడి కేసులో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.