ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించిన ఉగ్రవాద సంస్థ

ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించిన ఉగ్రవాద సంస్థ

Delhi blast : ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ పేలుడుకు ప్లాన్‌ చేసి… అమలు చేసింది తామేనని జైష్ ఉల్ హింద్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ పేలుడు కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బాంబు పేలుడు జరగకముందే ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు సమాచారం అందించాడు ఓ క్యాబ్‌ డ్రైవర్‌. తన కారులో అనుమానాస్పద వ్యక్తులు ప్రయాణిస్తున్నారని.. అధికారులకు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు క్యాబ్ డ్రైవర్.

మరోవైపు.. ఢిల్లీ పేలుడు ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని మోడీ. హోంశాఖ నుంచి పూర్తి వివరాలు తెప్పించుకున్నారు ప్రధాని. రాయబార కార్యలయానికి కూతవేటు దూరంలోనే పేలుడు జరగడంపై భారత్‌, ఇజ్రాయిల్ దేశాలు సీరియస్‌గా తీసుకున్నాయి. రెండు దేశాల స్నేహాబంధంపై జరిగిన దాడిగా భావిస్తున్నాయి ఇరు దేశాల ప్రభుత్వాలు.

ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు. పేలుడు ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలుడులో పీఈటీఎన్‌ ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సన్నాహకంగానే ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. టైమ్‌ స్టాంప్‌ 1970గా ఉండడం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, అందులో రికార్డయిన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేవు.

మరికొంత దూరంలో సగం కాలిన గులాబి రంగు చున్నీ, ఓ ఎన్వలప్‌ను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ఎన్వలప్‌లో ఇజ్రాయెల్‌ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముంబయిలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు, ఏరోస్పేస్‌ విభాగాలు, కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు.