టీ కప్పులో తుపాన్ : జమ్మలమడుగు పంచాయతీ చల్లారినట్టే

  • Published By: madhu ,Published On : January 24, 2019 / 10:01 AM IST
టీ కప్పులో తుపాన్ : జమ్మలమడుగు పంచాయతీ చల్లారినట్టే

విజయవాడ : జమ్మలమడుగు టీడీపీ ‘టీ’ కప్పులో తుపాన్ చల్లారినట్టేనా ? అంటే నేతల ముఖాలు..వారు చెబుతున్న వ్యాఖ్యలు వింటుంటే నిజం అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీట్లపై నెలకొన్న పంచాయతీకి బాబు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. మంత్రి ఆది నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బరెడ్డిలు..ఇతర సీనియర్‌ నేతలను కూర్చొబెట్టి సమస్య పరిష్కరించేందుకు బాబు ప్రయత్నించారు. కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానాలకు ఎవరు పోటీ చేయాలనే దానిపై ఒక వారం రోజుల్లో నిర్ణయం తీసుకొంటానని..అంతవరకు సంయమనం పాటించాలని బాబు సూచించారు. 
వారం రోజుల్లో బాబు నిర్ణయం : 
భేటీ అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. బాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆది నారాయణరెడ్డి వెల్లడించారు. వారం రోజుల్లో బాబు తన నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. తమిద్దరిలో ఎవరికి ఏ సీటు ఇచ్చినా పోటీకి సై అంటామన్నారు. పార్టీ గెలుపు కోసం తామిద్దరం కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్టే  కావాలని మంత్రి ఆది, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిలు పట్టుబడుతున్నారు. ఒకవేళ అసెంబ్లీ సీట్ రాకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేయాలని రామసుబ్బారెడ్డిపై అనుచరుల ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 
ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపని నేతలు : 
కడప ఎంపీగా పోటీ చేయడానికి రామ సుబ్బారెడ్డి, ఆది నారాయణరెడ్డిలు ఇష్టపడడం లేదు. మంత్రిగా ఆదినారాయణ రెడ్డికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఎంపీగా పోటీ చేస్తే పార్టీకి లాభం అని టీడీపీ అధిష్టాన వర్గం భావిస్తోంది. మరి ఓడిపోతే పరిస్థితి ఏంటి అంటూ ఆది నారాయణరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తామని చంద్రబాబు హామినిచ్చినట్లు టాక్. చివరకు పార్టీ అధినేత చేతుల్లో నిర్ణయం పెట్టేసి సమస్య పరిష్కారమైందని అనిపించారు. బాబు నిర్ణయం తరువాత మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.