సుగాలి ప్రీతి కేసులో జగన్‌ను పవన్ మెచ్చుకున్నట్లేనా!

సుగాలి ప్రీతి కేసులో జగన్‌ను పవన్ మెచ్చుకున్నట్లేనా!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. కర్నూలులోని సుగాలి ప్రీతి కేసును కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని కేసును సీబీఐకి అప్పగించింది వైసీపీ. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. ‘బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైంది. సీబీఐ విచారణ ద్వారా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి.  పాఠశాలకు వెళ్ళిన చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఉసురు తీసినవాళ్లని కఠినంగా శిక్షించాలని కర్నూలు నగరం నడిబొడ్డున లక్షల మంది ప్రజలు నినదించారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా సుగాలీ ప్రీతి కుటుంబం వెన్నంటి ఉన్న జనసేన నాయకులకీ, జన సైనికులకీ, ప్రజా సంఘాలకీ నా అభినందనలు అని పవన్ కళ్యాణ్’ 

సుగాలి ప్రీతి ఎవరు? ఏం జరిగింది..? ఎప్పుడు జరిగింది..
2017 ఆగస్టు 19న 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అత్యాచారాలకు బలైపోయిన బాధితుల పేర్లు బైటకు రాకూడదనే ఉద్దేశంతో బాధితురాలి పేరుని గీతగా మార్చారు. కర్నూలు శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్-పార్వతిదేవి దంపతుల 14 ఏళ్ల కుమార్తే ఈ గీత. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 10 తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న స్కూల్ లోని తరగతి గదిలో చనిపోయింది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెబుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ యజమాని కొడుకులు రేప్‌ చేసి చంపేశారని ఆరోపించారు.

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు సైతం… 2017 ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక నివేదికలో బాలికని రేప్‌ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
  
సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితుల అరెస్టు:
ఈ ఘటనపై విచారణకు ముందుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్‌ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. 
 
పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాధితురాలి తల్లి:
ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై దళిత సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. ఎలాంటి న్యాయం జరగలేదు. ఇదే విషయమై జనసేన అధినేత పవన్‌ను కలిశారు కుటుంబ సభ్యులు. ఎట్టకేలకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ నెరవేరింది.