జనసేనానీ జోరు : అభ్యర్థుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీ

  • Published By: madhu ,Published On : February 3, 2019 / 01:22 AM IST
జనసేనానీ జోరు : అభ్యర్థుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీ

విజయవాడ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జనసేనాని జోరు పెంచారు. ఓవైపు పార్టీని ప్రజలకు చేరువ చేస్తూనే… మరోవైపు ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌… ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో స్క్రీనింగ్‌ కమిటీని నియమించారు.

175 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన
60శాతం సీట్లు కొత్తవారికే
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు
ఐదుగురు సభ్యులతో స్క్రీనింగ్‌ కమిటీ

రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌.. అందుకోసం అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారు. జనసేన నుంచి దాదాపు 60శాతం కొత్త వారికి సీట్లు కేటాయిస్తానని ప్రకటించారు. పాత – కొత్త కలయికగా అభ్యర్థుల ఎంపిక ఉండబోతుందన్న సంకేతాలు ఇస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం పవన్‌ స్క్రీనింగ్‌ కమిటీని నియమించారు. పార్టీలో కీలకంగా ఉన్న ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పవన్‌ పొలిటికల్‌ సెక్రెటరీ హరిప్రసాద్‌, పార్టీ సీనియర్‌ నేతలు తమ్మిరెడ్డి శివశంకర్‌, మాదాసు గంగాధరం, పార్టీ ప్రధాన కార్యదర్శి అరహంఖాన్‌లకు ఈ కమిటీలో చోటు కల్పించారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఈ కమిటీ కీలకపాత్ర పోషించనుంది.  ఎన్నికలు సమీపిస్తుండడంతో జనసేనాని అభ్యర్థుల ఎంపికపై ఫోకస్‌ పెట్టారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు.