ఓ రైతన్న పోరాట కథ: ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మధ్యలో వ్యవసాయం..!!

  • Published By: nagamani ,Published On : August 21, 2020 / 10:38 AM IST
ఓ రైతన్న పోరాట కథ: ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మధ్యలో వ్యవసాయం..!!

కొన్ని విషయాలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ముఖ్యంగా పోరాటాలు..వీటిలో భూమి కోసం..భుక్తి కోసం..బాధాతప్తుల విముక్తి కోసం చేసిన పోరాటాలు చరిత్రలో ఎన్ని తరాలు గడిచినా అవి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అటువంటిదే ఓ రైతు..‘‘పంటలు పండే నా భూతల్లి ముందు మీరెంత? మీరిస్తానన్న డబ్బెంత? ఇది నా నేల..నా తండ్రి చెమట చిందించి పంటలు పండించిన నేల..మీరెంత చేసినా నా భూమిని ఇచ్చేదేలేదు’’ అంటూ ఓ రైతు తన భూమి కోసం ఏకంగా దేశ ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయకుండా తన భూమిలో బంగారు పంటల్ని పండిస్తున్నాడు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న తన పొలంలో ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నాడు. ఆ జపాన్ రైతు పేరు ‘టకావో షిటో’.



Japan Farmen జపాన్ రైతు టకావో షిటో పట్టుదలే..జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఉన్న నరితా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అదే..నరితా ఎయిర్ పోర్ట్ మధ్యలో రైతు టకావో షిటో తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కనిపిస్తాడు. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదు..





ఎప్పుడో 70వ దశకం ఆరంభంలో నరితా విమానాశ్రయాన్ని మరింతగా విస్తరించేందుకు జపాన్ ప్రభుత్వం సంకల్పించింది. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఆ చుట్టుపక్కల భూముల్ని రైతులకు నష్టపరిహారం ఇచ్చి సొంతం చేసుకుంది. కానీ టకావో షిటో తండ్రి మాత్రం తన భూమిని ఇవ్వటానికి అంగీకరించలేదు. ఎంత డబ్బు ఆశపెట్టినా ఇవ్వలేదు.





ఈ క్రమంలో కొంతకాలానికి తండ్రి చనిపోవడంతో టకావో షిటో చేసే ఉద్యోగం మానేసి తండ్రిలా వ్యవసాయం చేపట్టాడు. తండ్రి చనిపోయాక టకోవోను కూడా ప్రభుత్వం సంప్రదించింది భూమి ఇవ్వమని. కానీ తన తండ్రి తనకిచ్చిన భూమిని ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పేశాడు. దానికి ప్రభుత్వం ఆ భూమికి ఊహించని భారీగా పరిహారం చెల్లిస్తామన్నా ఒప్పుకోలేదు. ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది.





కోర్టు కూడా షిటో పక్షానే నిలిచింది. దీంతో జపాన్ లో షిటో గురించి బాగా ప్రచారం జరిగింది. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు షిటో కు మద్దతుపలికాయి. దీంతో అధికారులు కూడా షిటోను ఏమీ చేయలేకపోతున్నారు. విమానాశ్రయం మధ్యలో ఉన్న తన భూమిలో షిటో ఈనాటికీ కూరగాయలు పండిస్తున్నాడు. తాను పండించిన పంట చూసుకుంటూ మురిసిపోతుంటాడు..తన పొలంలో పనిచేసుకుంటూ అక్కడ ఎగురుతున్న విమానాలకు చూసుకుంటూ ఆకాశంలో ఎగిరినా..విశ్వంలో విహరించినా..వాలాల్సింది..నిలవాల్సింది ఈ భూమి మీదనే అనుకుంటుంటాడు గర్వంగా…

japan farmer Takao Shito cultivates his land in narita International airport