పట్టు వదలని విక్రమార్కుడు : సీఈవో ని కలిసిన కేఏ పాల్ 

  • Published By: chvmurthy ,Published On : March 30, 2019 / 03:56 PM IST
పట్టు వదలని విక్రమార్కుడు : సీఈవో ని కలిసిన కేఏ పాల్ 

అమరావతి: తమ  పార్టీ బి ఫామ్ లను టిడిపి ,వైసీపీ దొంగలించాయని, ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరో మారు ఏపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష‌్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం  విలేకరులతో మాట్లాడుతూ…. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఎన్నికల కమీషన్ కు సమర్పించానని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అయిన ఖర్చులను తానే ఇస్తానని ఎన్నికల సంఘానికి పాల్ తెలిపారు. 25 వతేది మద్యాహ్నం రెండు గంటలకు విజయవాడలోని  ఐలాపురం హోటల్ లో తమ పార్టీ బి ఫామ్ లు దొంగలించారని ఆయన  తెలిపారు. ప్రజాశాంతి పార్టీ బి ఫామ్  తో నామినేషన్లు వేసిన వారు తనను స్వయంగా వచ్చి కలవాలని కోరారు. దొంగిలించిన బి ఫామ్ ద్వారా నామినేషన్ వేసినవారు వచ్చినా వారిని తాను పార్టీలో చేర్చుకుంటానని తెలిపారు.

నేను తెలుగుదేశం కు మద్దతు ఇస్తున్నా అని ప్రచారం చేస్తున్నారని ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని పాల్ స్పృష్టం చేశారు. ఎవ్వరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయవద్దు అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని   అభివృద్ధి చేయడం లో చంద్రబాబు విఫలం అయ్యారన్నారు పాల్. చంద్రబాబు మళ్ళీ మోడీ తో కలుస్తాడని పాల్ జోస్యం చెప్పారు. జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని కేఏ పాల్ అభిప్రాయ పడ్డారు. తనకు లక్షల రూపాయలు ఆస్తి ఉందని అయితే అది  ఛారిటీ పేరుతో వుందన్నారు. నా మేనిఫెస్టో చూస్తే వేరే పార్టీకి ఓట్లు వేయరన్నారు.  ఎన్నికల కమీషన్ ఆదేశించినా తనకు భద్రత కల్పించలేదని  పాల్ ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరుగాలంటే డీజీపీ ,కొందరు ఎస్పీ లను మార్చాలని కేఏ పాల్ సూచించారు.