బయటకొచ్చే ఘడియలు : ఆఖరి దశలో ఆపరేషన్ వశిష్ట – 2

  • Published By: madhu ,Published On : October 20, 2019 / 02:10 PM IST
బయటకొచ్చే ఘడియలు : ఆఖరి దశలో ఆపరేషన్ వశిష్ట – 2

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆపరేషన్ రాయల్ వశిష్ట.. ఆఖరి దశకు చేరుకుంది. బోటును వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ.. ఫలించాయి. 2019, అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఐదో రోజు ఆపరేషన్‌లో భాగంగా.. విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్.. నదీ గర్భంలో ఉన్న బోటుకు తాళ్లు బిగించేశారు. ఇక.. ప్రొక్లెయినర్లతో బోటును లాగడమే మిగిలింది. బోటు ముందు భాగానికి.. ఐరన్ రోప్స్ కట్టారు డీప్ సీ డైవర్స్. అక్టోబర్ 21వ తేదీ సోమవారం బోటు వెనుక భాగంలో.. తాళ్లు బిగించనున్నారు. సాయంత్రానికి.. బోటు బయటకు వస్తుందని ధర్మాడి సత్యం బృందం, డీప్ సీ డైవర్స్ అంచనా వేస్తున్నారు. 

విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్ గోదావరి గర్భంలోకి వెళ్లారు. నదీ గర్భంలో ఉన్న రాయల్ వశిష్ట బోటును గుర్తించారు. గోదావరి అడుగు భాగానికి వెళ్లారు. వారికి పై నుంచి పైపులతో ఆక్సిజన్ అందించారు. అలా.. వారు లోపలికి వెళ్లి బోటు ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంతో పాటు అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా తేల్చారు. బోటులో బాగా ఒండ్రు మట్టి చేరినట్లు తెలిపారు. సాధారణంగా బోటు 40 టన్నులు ఉంటుందని.. ఇప్పుడు మట్టి చేరడంతో.. మరింత బరువు పెరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. బోటు బోల్తా పడకుండా.. నీటిపై వెళ్లేటప్పుడు ఎలా ఉంటుందో.. ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. 

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2లో భాగంగా.. 4 రోజులుగా బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం ఎంతో శ్రమించింది.  చివరికి గోదావరిలో బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఐరన్ రోప్‌తో ఉచ్చు బిగించడంతో పాటు యాంకర్‌తో బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో.. బోటు రెయిలింగ్ బయటకు వచ్చింది. కానీ.. పూర్తిస్థాయిలో బోటును వెలికితీయడంలో.. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

గోదావరి గర్భంలో ఉన్న బోటుకు.. తాళ్లు బిగించి.. బయట నుంచి ప్రొక్లెయిన్లతో లాగితేనే.. రాయల్ వశిష్ట బయటపడుతుందని భావించారు. ఐతే.. నది లోపలికి వెళ్లి.. బోటుకు తాళ్లు ఎవరు బిగించడమే సవాల్‌గా మారింది. దీనిని అధిగమిస్తే.. ఆపరేషన్ రాయల్ వశిష్ట 90 శాతం పూర్తైనట్లేనని ధర్మాడి సత్యం టీమ్ భావించింది. ఇందుకోసం.. విశాఖ నుంచి 10 మంది డీప్ సీ డైవర్స్‌ను.. కచ్చులూరుకు తీసుకొచ్చారు ధర్మాడి సత్యం.
Read More : బోటు దగ్గరకు వెళ్లిన డీప్ సీ డైవర్స్ : కచ్చులూరు వద్ద మరో డెడ్ బాడీ