వెన్నెల్లో కల్యాణం : ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం

  • Published By: madhu ,Published On : April 18, 2019 / 02:31 PM IST
వెన్నెల్లో కల్యాణం : ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం అంగరంగవైభవంగా జరుగుతోంది. రాములోరి కల్యాణం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పున్నమి వెన్నెల్లో సీతారాముల కల్యాణం చూసేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య శుభ ముహూర్తాన సీతమ్మను రాములోరు పరిణయమాడారు. 

కల్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. స్వామి వారికి బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు.  టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కల్యాణ వేదికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరుకు చెందిన నిపుణులతో ప్రత్యేకంగా అలంకరించారు. ముత్యంతో కూడిన 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందచేయనున్నారు. కల్యాణోత్సవానికి టీటీడీ, కడప జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం, వీఐపీలు హాజరు కానుండడంతో సుమారు 1500 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

1200 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్‌ భక్తులకు సేవలందించనున్నారు. గతేడాది జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించారు. ముఖ్యంగా షెడ్ల నిర్మాణం విషయంలో.. జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. లక్ష మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి హాజరుకావడంపై నెలకొన్న సందిగ్థత తొలగింది. ముఖ్యమంత్రి పాల్గొనడానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించడానికి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈవో విజ్తప్తి చేయగా.. సీఈసీ ద్వివేది అభ్యంతరం లేదని తెలిపారు. కానీ ఉత్సవాల్లో రాజకీయ ప్రసంగం చేయకూడదని.. రాజకీయ ప్రయోజనాలకు వేదికగా వాడుకోరాదని సూచించింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలని ఆదేశించింది.