ఏ క్షణమైనా కూలొచ్చు : భాస్కర్ అపార్ట్ మెంటు వాసులకు హెచ్చరిక

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 04:51 AM IST
ఏ క్షణమైనా కూలొచ్చు : భాస్కర్ అపార్ట్ మెంటు వాసులకు హెచ్చరిక

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకవైపు ఒరిగిన ఐదంతస్థుల భాస్కర్‌ అపార్ట్‌మెంట్‌ ను ఖాళీ చేయించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. భవనంలోనికి ఎవరినీ అనుమతించ వద్దని ఆదేశించారు. ఇళ్లలో విలువైన సామాగ్రి ఉందని.. బయటకు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అపార్ట్‌మెంట్‌ వాసులు కోరగా.. ఫైర్ సిబ్బంది సాయంతో ఫ్లాట్స్‌లో ఉన్న సామాను బయటకు తీసుకొచ్చారు. ఒకవేళ అపార్టుమెంట్ కూల్చాల్సి వస్తే బిల్డర్ నుంచి తమకు పరిహారం ఇప్పించాలని బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు.

కాకినాడ నగరం నడిబొడ్డున సినిమా రోడ్‌ను ఆనుకుని దేవీ మల్టీప్లెక్స్ ప్రక్కనే ఈ భాస్కర్ ఎస్టేట్స్ ఉంది. 13 ఏళ్ల క్రితం నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 20 ఫ్లాట్ల చొప్పున మొత్తం 40 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ భవనానికి 60 పిల్లర్లు ఉంటే వాటిలో వెనుక భాగం వైపు ఉన్న 3 పిల్లర్లలో ఉన్నట్టుండి పగుళ్లొచ్చాయి. అవన్నీ దాదాపుగా ధ్వంసమైపోయాయి. కాంక్రీట్ మొత్తం పెచ్చులుగా ఊడిపోయి, ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు.. పిల్లర్లను పరిశీలించి అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాలని సూచించారు. దీంతో.. 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భాస్కర్ అపార్ట్‌మెంట్‌ ను జేఎన్టీయూ నిపుణుల బృందం పరిశీలిచింది. అపార్ట్‌మెంట్‌ నివాసయోగ్యం కాదని తేల్చింది. అపార్ట్ మెంట్ ని కూల్చి వేయడమే కరెక్ట్‌ అని జేఎన్టీయూ బృందం స్పష్టం చేసింది. కాగా అపార్ట్ మెంట్ కూల్చివేతకు బిల్డర్ రెండు వారాలు గడువు కోరాడు. రిట్రో ఫిట్టింగ్ టెక్నాలజీతో మరమ్మతులు చేస్తున్నారు.