అజ్ఞాతంలో కల్కి దంపతులు

  • Published By: veegamteam ,Published On : October 18, 2019 / 03:49 AM IST
అజ్ఞాతంలో కల్కి దంపతులు

కల్కిభగవాన్‌ ఆశ్రమంలో ఐటీ దాడులు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కోట్ల రూపాయల నగదు దొరికినట్లు తెలుస్తోంది. స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులతో కల్కి భగవాన్ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లారు.

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కిభగవాన్‌కు చెందిన ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉన్నది. వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల నిర్వాహకుడు లోకేష్‌ దాసాజీతో పాటు మరికొంత మంది సిబ్బందిని రహస్యంగా విచారించారు. ఈ విచారణలో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తుల సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. 

బినామీల పేరుతో వేల ఎకరాల భూముల అమ్మకాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు… సుమారు 40 కోట్ల భారతీయ, విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు గోవర్దనపురంలోని కల్కి కార్యాలయంలో సోదాలు నిర్వహించిన రెండు బృందాలు చెన్నైకి వెళ్లిపోయాయి. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం మరికొన్నిచోట్ల సోదాలు నిర్వహించే అవకాశముంది.

కల్కిభగవాన్‌ ఆశ్రమం ఐదెకరాల నుంచి ప్రారంభమై వేలాది ఎకరాలకు విస్తరించింది. అయితే మూడేళ్లుగా పన్నులతోపాటు ఐటీ రిటర్న్స్‌ చెల్లించడం లేదని సమాచారం. అంతేకాదు.. పలురకాల కంపెనీలు, ట్రస్టీల పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు కల్కి ఆశ్రమంపై నిఘా పెట్టారు. చెన్నైలోని ప్రధాన కార్యాలయంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆశ్రమాలు, కార్యాలయాలు, భూముల కొనుగోళ్లు, విరాళాల సేకరణలపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం కల్కి భగవాన్ దంపతులు ఎక్కడున్నారో తెలియడం లేదు.