అనంతపురంలో కియా కారు ఆవిష్కరణ 

10TV Telugu News

అనంతపురం : జిల్లాలో కియా కంపెనీ తయారు చేసిన తొలి కారు ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్‌ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు జనవరి 29న తొలి కారును ఏపీ సీఎం చంద్రబాబు కారును ఆవిష్కరించనున్నారు. రూ.13,500 కోట్లతో కియా ప్లాంట్‌ లో తొలికారు రూపుదిద్దుకుంది. 

కియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
కియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017, ఏప్రిల్‌ 27న ఒప్పందం చేసుకుంది. ప్లాంట్‌ నిర్మాణ పనులు 2017, నవంబరు 15న ప్రారంభించింది. 2018, ఫిబ్రవరి 22న సీఎం చంద్రబాబు, కియా మోటార్స్‌ అధ్యక్షుడు పార్క్‌ చేతుల మీదుగా ఫేమ్‌ ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం జరిగింది. నేడు సీఎం చంద్రబాబు, భారత్‌లో కొరియా రాయబారి షిన్‌ బాంకిల్‌ చేతుల మీదుగా ప్రయోగాత్మక ఉత్పత్తి వేడుక నిర్వహించనున్నారు. మిడ్‌ ఎస్‌యూవీ రంగంలో వస్తున్న తొలి కారు ధర రూ.9 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ ఉంటుందని ఆ సంస్థ మార్కెటింగ్‌ మేనేజర్ మనోహర్‌ భట్‌ తెలిపారు. 

కియా కారు స్పెషల్ 
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌ గ్రూప్‌నకు కియా అనుబంధ సంస్థ. పెనుకొండ సమీపంలోని కర్మాగారం కోసం రూ.13,500 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 11 వేల మందికి ఉపాధి లభించనుంది. అనుబంధ పరిశ్రమల ద్వారా రూ.2,920 కోట్ల పెట్టుబడులతోపాటు, 3,900 మందికి ఉపాధి కలగనుంది. ఈ ప్లాంట్‌లో ఏడాదికి సగటున 3 లక్షల కార్లు తయారవుతాయి. గంటకు సగటున 50 కార్లు సిద్ధమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా 14 ఉత్పత్తి కేంద్రాలు ఉండగా, ఇది 15వది. భారత్‌లో తొలి పరిశ్రమ. భారతీయుల అవసరాలకు వీలైన కార్లు తయారు చేయనున్నారు. 2025 తర్వాత ఇదే ప్లాంట్‌ నుంచి కియా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కూడా ఆరంభించనున్నారు.

 

×