కరవు జిల్లాలో ‘KIA’ కార్ల తయారీ : 6 నెలలకో కొత్త మోడల్

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 08:57 AM IST
కరవు జిల్లాలో ‘KIA’ కార్ల తయారీ : 6 నెలలకో కొత్త మోడల్

అనంతపురం : జనవరి నెలాఖరుకి ఏపీలోని అనంతపూర్ జిల్లాలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ‘కియా మోటార్స్‌ ఇండియా’ప్లాంట్ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఈ ప్లాంట్ లో కార్ల తయారీ ప్రారంభం కానున్నట్లు కియా మోటార్స్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ హెడ్‌ మనోహర్‌ భట్‌ చెప్పారు. ‘ఎస్‌పీ 2ఐ’ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీ వాహనాలు ఉత్పత్తి చేయాలని దక్షిణ కొరియా కార్ల దిగ్గజం భావిస్తోంది. 2018లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శించింది. 
ఈ క్రమంలో 2019 జూన్‌, జూలై నాటికి ఎస్‌పీ 2ఐ’ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లో ఉంటుందని కియా మోటార్స్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ హెడ్‌ మనోహర్‌ భట్‌ తెలిపారు. అనంతరం ప్రతీ ఆరు నెలలకొక కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. సంవత్సరానికి మూడు లక్షలకుపైగా కార్ల తయారీ సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్‌లో జనవరి 31కల్లా కార్ల తయారీ ప్రారంభిస్తామనీ..ముందుగా ‘ఎస్‌పీ 2ఐ’ కార్లను తయారు చేస్తామన్నారు. అంతర్జాతీయంగా కియా మోటార్స్‌కు ఇది 15వ ప్లాంట్‌. భారత్‌లో మాత్రం తొలి ప్లాంట్‌ కావటం..అందులోను కరవు జిల్లాగా పేరొందిన అనంతపురంలో కావటం మరో విశేషం. 535.50  ఎకరాల్లో నిర్మాణమవుతున్న ఈ ప్లాంట్ లో ఆటోమొబైల్‌ విడి భాగాలు తయారు చేసే అనుబంధ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి.

కియో మోటార్స్ కంపెనీ 200 కోట్ల డాలర్ల  అంటే రూ.14,200 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీని కోసం 110 కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేస్తుండగా..2021 నాటికి మరో 80 కోట్ల డాలర్ల పెట్టుబడితో అనంతపురం ప్లాంట్‌ మేకింగ్ సత్తాను డెవలప్ చేయాలని క్రియో మోటార్స్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. తొలి దశలో ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 7,000 మందికి ఉపాధి లభించనున్నది.  విడిభాగాల ఉత్పత్తి కోసం సమీపంలోనే 40 అనుబంధ కంపెనీలు, 100 ఎకరాల్లో రైల్వే సైడింగ్‌, 48.47 ఎకరాల్లో ట్రక్‌ టెర్మినల్‌ ఏర్పాటు అందుబాటులోకి రానున్నాయి. ఈ సెకండ్ టైమ్ డెవలప్ మెంట్ తో 10,000ల మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.