కోడెల అంత్యక్రియలకు ఏర్పాట్లు

  • Published By: madhu ,Published On : September 18, 2019 / 01:43 AM IST
కోడెల అంత్యక్రియలకు ఏర్పాట్లు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం అధికార లాంఛానాలతో నిర్వహించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గుంటూరుకు అక్కడి నుంచి నరసారావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలించారు. మరోవైపు.. ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నుంచి ఆంబులెన్స్‌లో కోడెల పార్థివదేహాన్ని గుంటూరుకు తరలించారు. అక్కడకు చేరుకోగానే జిల్లా కేంద్రంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కోడెల పార్థివదేహాన్ని ఉంచారు. అక్కడి నుంచి నరసారావుపేటకు తరలించారు. కోడెల భౌతిక కాయానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు శోకతప్త హృదయాలతో నివాళులర్పించారు. 

కెన్యా నుండి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుండి రోడ్డు మార్గాన ఇబ్రహీంపట్నం చేరుకున్న కోడెల తనయుడు శివరామ్.. తన తండ్రి పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి మృతదేహంతో పాటే… అంబులెన్స్‌లో ఆయన గుంటూరుకు వెళ్లారు. మరోవైపు.. గొల్లపూడి నుండి భవానీపురం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర చంద్రబాబు కాలి నడకన మిగిలిన నాయకులతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. 

కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ఇదిలావుంటే, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఆయన మొబైల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఆత్మహత్య అనంతరం పోలీసుల సాధారణ పరిశీలనలో ఆయన పర్సనల్ ఫోన్ కనిపించలేదు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోడెల ఫోన్ స్విచాఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఓ కాల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలు పూర్తైన తర్వాత.. కోడెల కుమారుడు శివరాంను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. 
Read More : ఉస్మానియాలో కోడెల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి