వేములవాడ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 11:11 AM IST
వేములవాడ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (జనవరి 18, 2020) రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడులో నిర్వహించిన రోడ్ షో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే వృథానేనని అన్నారు. పని చేసే వారిని ఆశీర్వదించాలని కోరారు. కౌన్సిలర్ ఎన్నికలు రాగానే కులమని, మతమని, ఇంకోటని వేరే ఆలోచన చేస్తే అభివృద్ధి విషయంలో మళ్లీ పంచాయతీ తప్ప మరొకటి ఉండదన్నారు. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. 

కాంగ్రెస్ అభ్యర్థులు 24 చోట్ల పోటీ చేస్తున్నారు…వారికి ఓటేస్తే లాభమేంటన్నారు. కాంగ్రెస్ వారు రాష్ట్రంలో లేరు, కేంద్రంలో లేరు వారి వల్ల అయ్యేదేముందని ప్రశ్నించారు. ఒక్క కౌన్సిలర్ గెలిచినా లొల్లి పెట్టడం, బొబ్బ పెట్టడం తప్ప వారి వల్ల అయ్యేది ఏమీ లేదన్నారు. పని చేసే నాయకులను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ వారు డబ్బాల రాళ్లు వేసి ఊపినట్లేనని… వారిది లొల్లి ఎక్కువ, బొబ్చె ఎక్కువ తప్ప.. వారి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. పని తక్కువ బిల్డప్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం బీజేపీ నాయకులు ఇళ్ల దగ్గరికి వచ్చినప్పడు నిలదీయాలన్నారు. కేసీఆర్ ఏమీ చేసిండో, రమేష్ చేసిండో అడగాలన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం..కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, వేములవాడ దేవస్థానం అభివృద్ధి, వేములవాడ పట్టణంలో రూ.218 కోట్లతో అభివృద్ధితోపాటు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బీజేపీ ఏం అభివృద్ధి చేసిందో ప్రజలు అడగాలన్నారు. కేంద్రంలో బీజేపీ ఐదేళ్లు ప్రభుత్వంలో ఉండి రాష్ట్రానికి, ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. తెలంగాణకు 19 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి చెబితే 19 పైసలు కూడా ఇవ్వలేదన్నారు.

చెరువులు బాగుచేస్తున్న మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు ఇవ్వమని కేంద్రానికి నీతి ఆయోగ్ చెబితే 5 పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఐదేళ్లలో తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టును కూడా మంజూరు చేయలేదన్నారు. తెలంగాణకు అదనంగా ఒక బుడ్డ పైస కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. సిరిసిల్ల, వేములవాడ లాంటి మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లను తీసుకొచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే..పట్టించుకోకుండా ముసిముసి నవ్వులు నవ్వారని వెల్లడించారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలో ప్రజలు నిలదీయాలన్నారు.