దేశానికి ఆదర్శంగా: కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా.. తెలంగాణ సర్కారు బడి!

దేశానికి ఆదర్శంగా: కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా.. తెలంగాణ సర్కారు బడి!

ఒకప్పుడు సర్కారు బడులు అంటే.. టైమ్‌పాస్ చేసే టీచర్లు, పెద్దగా చదువుపై ఇంట్రస్ట్ లేని వాతావరణంలో విద్యార్ధులు, చదువు కోసం అన్నట్లుగా కాకుండా.. ఏదో ఉన్నది అంటే ఉన్నది అన్నట్లుగా సర్కారు బడులు ఉండేవి.. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా వాటి ప్రాధాన్యతను ప్రజలకు అర్థమయ్యేలా ఆధునీకరణను సంతరించుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే కార్పొరేట్‌ పాఠశాలను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్మించిన జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రారంభానికి ముస్తాబయ్యింది. ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ‘గివ్‌ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ’ సహకారంతో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన సర్కారు బడి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వడమే కాదు.. దేశానికి ఆదర్శం అన్నట్లుగా తయారైంది.

ఆరొందల మంది ఉన్న ఈ పాఠశాల 1960లో ప్రారంభం అవ్వగా, పాత భవనాలను కూల్చి 33 రూములతో సుమారు వెయ్యి మంది విద్యార్ధులు విద్యను అభ్యసించేలా నూతన భవనాన్ని నిర్మించారు. రూ.30 లక్షలతో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టులను ఏర్పాటు చేశారు. ఒకేసారి 400 మంది విద్యార్థులు కూర్చుండి భోజనం చేసేలా డైనింగ్‌ హాల్‌, అత్యాధునిక గ్రంథాయలం, సురక్షిత తాగు నీరు, 50 కంప్యూటర్లతో డిజిటల్‌ ల్యాబ్‌, అధునాతనమైన సైన్స్‌, మాథ్స్‌ ల్యాబ్‌లు, మోడ్రన్‌ టాయిలెట్స్‌, 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్‌ ఈ పాఠశాలను ప్రారంభించబోతున్నారు.

సర్కారు బడి అనగానే మనకు గుర్తొచ్చేది నాలుగు భవనాలు, ఖాళీ గ్రౌండ్. సరిగా పట్టించుకోకపోవడం.. వసతుల లేమి.. కానీ సిరిసిల్లలో సర్కారు బడిని చూస్తే షాకవ్వాల్సిందే. చుట్టూ పాఠశాల భవనం, మధ్యలో పచ్చికతో నిండిన మైదానం చూస్తే.. ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ స్కూలును ఇవాళ(01 ఫిబ్రవరి 2021) కేటీఆర్ ప్రారంభిస్తున్నారు.