కర్నూల్ పోలింగ్ బూతుల్లో గందరగోళం : ఏర్పాట్లపై ఓటర్ల ఆగ్రహం

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 03:21 AM IST
కర్నూల్ పోలింగ్ బూతుల్లో గందరగోళం : ఏర్పాట్లపై  ఓటర్ల ఆగ్రహం

ఎన్నికల ఏర్పాట్లు ఇలా చేస్తారా ? వేల సంఖ్యలో ఓటర్లు ఉంటే తగిన సిబ్బంది ఉండరా ? అంటూ కర్నూలు జిల్లాలోని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5.30గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా..పోలింగ్ సిబ్బంది లేట్‌గా వచ్చారు. ఈవీఎంలు కూడా పని చేయలేదు. దీనితో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, నంద్యాల, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. 

ఉదయం 6 గంటలకు ముందుగానే ఓటు వేయడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అయితే..ఎన్నికల అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని పలు కేంద్రాల్లో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో ఓటర్లు రావడం..సరైన సిబ్బంది లేకపోవడంతో ఓటు వేయడానికి కేంద్రంలోకి చొచ్చుకపోయారు. ఓటర్ లిస్టులో పేర్లలో మార్పులు ఎందుకు చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఓటర్ స్ల్పిప్పుతో పాటు ఈసీ పేర్కొన్న 11 గుర్తింపు కార్డులు తీసుకొచ్చినా తమకు ఓటు వేయడానికి అనుమతించడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు కనీసం వీల్ ఛైర్ సౌకర్యం కల్పించలేదంటున్నారు. వెంటనే ఎన్నికల అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.