అందుకే పవన్‌తో కలిశా: హామీలను బాండ్ పేపర్‌పై రాసిస్తా

  • Edited By: vamsi , March 28, 2019 / 07:15 AM IST
అందుకే పవన్‌తో కలిశా: హామీలను బాండ్ పేపర్‌పై రాసిస్తా

జనసేన తరుపున విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన ప్రకటన చేశారు. విశాఖలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్టణానికి మేనిఫెస్టో తాను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబోతున్నట్లు చెప్పారు. వాటిని చేయకుంటే తనను కోర్టుకు లాగొచ్చు అని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ దమ్ము తమ పార్టీకి ఉందని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు.

జనసేన ఆవిర్భవానికి ముందే పవన్‌ కళ్యాణ్‌తో కలిశానని, చర్చించానని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ తర్వాత తాను మహారాష్ట్ర వెళ్లడం, పవన్ పార్టీ పెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయని అన్నారు. కలాం స్ఫూర్తితో, యువతను ఓ మార్గంలో తీసుకుని వెళ్లవలసిన బాధ్యత తనపై ఉందని ఆ ఆలోచనతోనే జనసేనలో చేరినట్లు తెలిపారు. తనను అన్ని పార్టీలు ఆహ్వానించాయని, అయితే జీరో బడ్జెట్ రాజకీయాలు చేసేవారితో కలవాలనే పవన్ కళ్యాణ్‌తో కలిసినట్లు స్పష్టం చేశారు.