రంగారెడ్డిలో చిరుత: పశువులపై దాడిలో దూడ మృతి

రంగారెడ్డిలో చిరుత: పశువులపై దాడిలో దూడ మృతి

హైదరాబాద్‌కు పొరుగు జిల్లా అయిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుతపులి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. శనివారం రాత్రి చేసిన దాడిలో ఆవు దూడ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో చిరుత సంచారం జరుగుతున్నట్లు గుర్తులు కనిపిస్తున్నాయని గ్రామస్థులు వెల్లడించారు. అయితే ఒక్కటి కంటే ఎక్కువ తిరుగుతున్నాయేమోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

శనివారం రాత్రి నగరానికి 50కి.మీల దూరంలో ఉన్న యాచారంలోని మేడిపల్లి గ్రామంలో చిరుత దాడి చేసినట్లుగా గురుతులు కనిపిస్తున్నాయట. గ్రామస్థుడైన బి.సాయన్న మాటల్లో.. ‘చిరుత ఎక్కడ దాడి చేస్తుందోననే భయంలో తలుపులు వేసుకునే కాలం గడుపుతున్నాం. ఫిర్యాదు అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు 2 బోన్లు ఏర్పాటు చేసినా లాభం లేదు. ఇప్పటికీ చిరుతను పట్టుకోలేకపోవడంతో చిరుత దాడులు చేస్తూనే ఉంది’ అని ఆక్రందనను వినిపించాడు. 

రెండు నెలలుగా దీనిని పట్టుకోవాలని ఫారెస్టు అధికారులు ప్రయత్నిస్తున్నారు. యాచారంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నా బంధించలేకపోతున్నారు.