నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు : దేశంలో తొలిసారి ఎం-3 ఈవీఎంల వినియోగం

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 02:14 AM IST
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు : దేశంలో తొలిసారి ఎం-3 ఈవీఎంల వినియోగం

నిజామాబాద్ : నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ పోలింగ్ జరపాలని డిసైడైన ఎన్నికల అధికారులు… ఇందుకోసం అత్యాధునిక ఈవీఎంలను వాడబోతున్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ప్రపంచంలోనే తొలిసారిగా ఎం-3 ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. 

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక ఈసీకి కత్తిమీద సాములా మారింది. టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈసారి మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 170 మందికిపైగా పసుపు, ఎర్రజొన్న రైతులే ఉన్నారు. అయితే.. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీకి దిగడంతో సాధారణ ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించడం కష్టంగా మారింది. బ్యాలెట్ పద్దతిలో నిర్వహిద్దామనుకున్నా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని ఈసీ భావించింది. దీంతో దేశ చరిత్రలో తొలిసారిగా ఎం-3 ఈవీఎంలతో ఇక్కడ ఎన్నికలను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఎం-3 ఈవీఎంలను నిజామాబాద్‌కు తరలించారు.

ఇప్పటివరకు మనదేశంలో ఎం-2 ఈవీఎంల ద్వారా గరిష్టంగా 4 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించారు. కానీ.. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో M-3 ఈవీఎంలతో 12 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎంతో చాలెంజ్‌తో కూడుకున్నదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 

నిజామాబాద్‌లో పర్యటించిన కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్… కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి ఎం-3 ఈవీఎం పనితీరును పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పోలింగ్ ఏర్పాట్లపై చర్చించారు.  ప్రపంచంలో ఇంతవరకు ఎం-3 ద్వారా ఎక్కడా ఎన్నికలు నిర్వహించలేదని…. తొలిసారిగా నిజామాబాద్‌లో వీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు.  అతి తక్కువ సమయంలో వీటిని ఏర్పాటు చేశామని…^నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.. ఒక చరిత్రకు నాంది పలుకుతోందని అన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్, 12 బ్యాలెట్ యూనిట్స్ ఉపయోగిస్తున్నామని.. వీటిలో ఏ బ్యాలెట్‌లో సమస్య వచ్చినా దాని స్థానంలో మరొకటి అమరుస్తామని చెప్పారు. ఎం-3 ఈవీఎంలపై పోలింగ్ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని… ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.