మనిషే కానీ : రాత్రి అయితే రక్తం తాగుతాడు

వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరినీ హడలెత్తిస్తోంది. రాత్రయితే చాలు అతడు రాక్షుసుడిలా మారిపోతున్నాడు. జంతువుల నెత్తురు తాగుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాడు.

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 11:18 AM IST
మనిషే కానీ : రాత్రి అయితే రక్తం తాగుతాడు

వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరినీ హడలెత్తిస్తోంది. రాత్రయితే చాలు అతడు రాక్షుసుడిలా మారిపోతున్నాడు. జంతువుల నెత్తురు తాగుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాడు.

వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరినీ హడలెత్తిస్తోంది. రాత్రయితే చాలు అతడు రాక్షుసుడిలా మారిపోతున్నాడు. రక్తదాహంతో రగిలిపోతున్నాడు. జంతువుల నెత్తురు తాగుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాడు. రాత్రిపూట భయానక పనులు చేస్తున్నాడు. అమరచింత మండలం సింగంపేటకు చెందిన కమ్మరి రాజు చీకటిపడితే చాలు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు.

పగటి పూట అందరితో కలిసిమెలిసి ఉండే రాజు… రాత్రయితే చాలు రక్త పిశాచిలా మారిపోతున్నాడు. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమిలాంటి ప్రత్యేక రోజుల్లో ఇతడు పచ్చి నెత్తురు తాగకుండా నిద్రపోవడంలేదు. ఆ రోజుల్లో ఆవురావురుమంటూ మేకలు, గొర్రెల రక్తాన్ని తాగటం అతనికి చాలా ఇష్టం. అందుకే రాత్రిపూట గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లి బతికుండగానే వాటిని కొరికి చంపి రక్తం తాగేస్తున్నాడు. మళ్లీ పొద్దున్నే యజమానుల ఇంటి ముందు ఆ చనిపోయిన మూగజీవాలను పడేస్తున్నాడు. ఒకటికాదు రెండు కాదు… ఇప్పటివరకు 50కి పైగా మూగజీవాలను ఇలా చంపేసి వాటి రక్తంతో తన గొంతు తడుపుకున్నాడు.

మూడేళ్ల క్రితం వరకు బాగానే ఉన్న రాజు అనుకోకుండా ఇలా మారిపోయాడు. ఏమైందో తెలియదుగానీ మూగజీవాల రక్తానికి మరిగాడు. పగలంతా ప్రశాంతంగా కనిపించే ఇతడు… రాత్రయ్యాక తన రక్తదాహం తీర్చుకునేందుకు గ్రామంలో తిరుగుతాడు. అర్ధరాత్రి కంటికి కనిపించిన మేకనో, గొర్రెనో ఊరు శివార్లలోకి తీసుకువెళ్లి నోటితో వాటిని కొరికి చంపేస్తాడు. ఆ తర్వాత వాటి పచ్చి రక్తాన్ని కూడా నీళ్లు తాగినంత ఈజీగా తాగేస్తాడు. అంతేకాదు… మరుసటి రోజు అదే మేకను భుజాన వేసుకుని గ్రామంలోకి వస్తాడు. దీంతో ఆ గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారు. 

మరోవైపు.. అతని వింత ప్రవర్తనతో గొర్రెలు, మేకలను కోల్పోయిన వారు… రాజు తల్లిదండ్రులకు విషయం చెప్పి నష్టపరిహారం కింద డబ్బులు తీసుకుంటున్నారు. కన్నకొడుకు తమ కళ్లముందే పచ్చి నెత్తురుకు బానిసవుతుంటే చూస్తూ ఊరుకోలేని తల్లిదండ్రులు,… ఆ జబ్బు ఏంటో తెలుసుకుందామని 6 నెలల క్రితం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అయినా ఇతడి ప్రవర్తన మారలేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అంతుచిక్కలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు లోనవుతుండగా… గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

అతడి వింత ప్రవర్తనతో హడలిపోతున్నామంటున్నారు గ్రామస్తులు. ఇళ్ల నుంచి బయటకి రావాలంటేనే భయపడుతున్నామని… నోరులేని మూగజీవాల రక్తం తాగుతున్న అతను… మనుషులను కూడా చంపి రక్తం తాగడని గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజు ప్రవర్తనతో ప్రతిరోజు భయంభయంగా బతుకుతున్నామంటున్న గ్రామస్తులు… ప్రభుత్వమే తమను రక్షించాలని వేడుకుంటున్నారు. అతడిని తమ గ్రామం నుంచి ఇతరచోటుకి తరలించాలని కోరుతున్నారు.

రాజు మాత్రం.. తన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నానని చెబుతున్నాడు. తాను గొర్రెలు, మేకలను చంపుతుండటంతో.. వాటి యజమానులు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని అమాయకంగా చెబుతున్నాడు.