ఏమి జరిగింది : కోడెల మృతి..ఎన్నో అనుమానాలు

  • Edited By: madhu , September 19, 2019 / 01:08 AM IST
ఏమి జరిగింది : కోడెల మృతి..ఎన్నో అనుమానాలు

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పల్నాటి పులిగా పేరుగాంచిన కోడెల.. సూసైడ్‌ చేసుకోవడానికి కారణాలేంటి? ఘటనాస్థలిలో లభించిన ఆధారాలేంటి? పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో ఏముంది? పోలీసుల దర్యాప్తు ఎటువైపు సాగుతోంది? విచారణలో బయటపడుతున్న నిజాలేంటి? కోడెల మృతిపై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు తలెత్తాయి. వాటన్నింటిని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలం నుంచి సేకరించిన ఆధారాలతో పాటు టెక్నికల్‌ ఎవిడెన్స్‌లతో విచారణ వేగవంతం చేశారు. బ్యాక్‌ గ్రౌండ్‌ వర్క్‌ పూర్తి చేసి ఆ తర్వాత కోడెల కుటుంబ సభ్యులను కూడా విచారించనున్నారు.

కోడెల శివప్రసాద్‌ సూసైడ్‌ టెండెన్సీతో బాధపడుతున్నట్టు భావిస్తున్నారు పోలీసులు. గుంటూరులో కూడా ఆత్మహత్యాయత్నం చేశారని.. అయితే అప్పుడు గుండెపోటుగా కుటుంబసభ్యులు నమ్మించినట్టుగా గుర్తించారు. ఇటు ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల వల్లనే తమ తండ్రి చనిపోయాడని కోడెల కుమార్తె ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోడెల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆయన మేనల్లుడు కూడా ఫ్యాక్స్‌ ద్వారా కంప్లైంట్‌ ఇచ్చారు. మరోవైపు పోస్ట్‌మార్టమ్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌, కాల్‌డేటాల ఆధారంగా తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు పోలీసులు.

పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ ప్రకారం కోడెల తాడుతో ఉరివేసుకోవడం వల్లనే మృతిచెందినట్టు నిర్ధారణ అయింది. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసిన పోలీసులు.. కోడెల మృతికి ముందు ఏం జరిగిందనే దానిపై దాదాపు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతి అనంతరం కోడెల సెల్‌ఫోన్‌ కనబడకుండా పోయింది. దాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే దాచారా..? లేక దొంగిలించారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే కాల్‌ డేటాను సేకరించిన పోలీసులు.. చివరిసారిగా కోడెల శివప్రసాదరావు బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌తో మాట్లాడినట్టు గుర్తించారు. ఆ డాక్టర్‌తో పాటు కోడెల కుమారుడు శివరాం, మరికొందరిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్‌లో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. 
Read More : ముగిసిన కోడెల అంత్యక్రియలు…జన సంద్రమైన నరసరావుపేట