త్రిముఖ పోటీ : ఉత్కంఠ రేపుతున్న పాలమూరు ఎన్నిక

మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్టీలకూ హాట్‌సీట్‌గా మారిపోయింది. మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

  • Published By: madhu ,Published On : April 6, 2019 / 12:51 PM IST
త్రిముఖ పోటీ : ఉత్కంఠ రేపుతున్న పాలమూరు ఎన్నిక

మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్టీలకూ హాట్‌సీట్‌గా మారిపోయింది. మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్టీలకూ హాట్‌సీట్‌గా మారిపోయింది. మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ గెల్చిన వారికి హస్తినలో పలుకుబడి దక్కుతుందనే సెంటిమెంట్ ఉండటంతో… పాలమూరులో పట్టు సాధించేందుకు అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. పాలమూరు నుంచి గెల్చి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నేతలు.. జాతీయ రాజకీయాల్లో రాణించారు.

1957 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. జే రామేశ్వరరావు, మల్లిఖార్జున్‌లు మూడుసార్లు విజయం సాధించారు. జైపాల్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి రెండు సార్లు గెల్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009లో మహబూబ్‌‍నగర్ నుంచి గెలుపొందారు. మహబూబ్‌నగర్ స్థానం నుంచి గెల్చిన కేసీఆర్… తర్వాతి కాలంలో తెలంగాణకు సీఎం అయ్యారు. రెండుసార్లు గెల్చిన సిట్టింగ్ ఎంపీ జీతేందర్‌రెడ్డి.. లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేతగా వ్యవహరించారు. జైపాల్‌రెడ్డి, మల్లిఖార్జున్ ఇద్దరూ కేంద్రమంత్రులుగా.. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. 

1957లో ఏర్పడిన మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో 15 లక్షల 5 వేల మంది ఓటర్లున్నారు. ఏడు అసెంబ్లీ నియోజవర్గాలున్నాయి. రాజకీయాలకు కొత్త అయిన మన్నె శ్రీనివాస్‌రెడ్డిని పోటీలో దింపడం కాస్త ప్రతికూలాంశమే అయినా… లక్షకు పైగా మెజారిటీతో గెల్చి హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. 
Read Also : వరంగల్ ఎవరికి వరం : కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? కారు దూసుకుపోతుందా?

రాత్రికి రాత్రి పార్టీ మారి బీజేపీ టికెట్ దక్కించుకున్న డీకే అరుణ.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాలమూరుపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిపెట్టడమే కాకుండా.. కమలం కేడర్ తనకు కలిసొస్తుందని డీకే అరుణ భావిస్తోంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పటి పరిచయాలు.. అనుచరులు.. బీజేపీ వ్యూహాలు విజయాన్ని సాధించి పెడతాయనే ధీమా ఆమెలో కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డిని కాదని… కొత్త వ్యక్తిని బరిలోకి దింపడం చాలా ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. పైగా.. జితేందర్‌రెడ్డి కూడా కాషాయం కండువా కప్పుకోవడంతో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ కేడర్‌నుంచి సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉందని బీజేపీ అనుకొంటోంది. 

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే… సీనియర్లు సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపించని పరిస్థితుల్లో వంశీచంద్‌రెడ్డికి టికెట్ దక్కింది. పాలమూరులో గెల్చి మళ్లీ పట్టు సాధించాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే.. నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం మైనస్‌గా మారుతోంది. కానీ… జైపాల్‌రెడ్డి మంత్రాంగం, మైనారిటీలు అనుకూలాంశమని కాంగ్రెస్ భావిస్తోంది. మరి త్రిముఖ పోటీలో గెలుపు ఎవరి తలుపు తడుతుందో చూడాలి. 
Read Also : ఖమ్మం, మానుకోటలో ఎరుపు మెరిసేనా : పట్టుకోసం కమ్యూనిస్టుల దృష్టి