ఈ బియ్యం పశువులు కూడా తినవన్న లోకేష్ : తప్పుడు ప్రచారం అన్న మంత్రి

ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య మరో వివాదం రేగింది. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 02:48 AM IST
ఈ బియ్యం పశువులు కూడా తినవన్న లోకేష్ : తప్పుడు ప్రచారం అన్న మంత్రి

ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య మరో వివాదం రేగింది. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఏపీలో అధికార, ప్రతిపక్షం మధ్య మరో వివాదం రేగింది. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం నాణ్యత విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సన్నబియ్యం గురించి నారా లోకేష్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. నాణ్యమైన సన్నబియ్యం అని ప్రభుత్వం చెబుతున్నా.. బియ్యంలో నాణ్యత లేదని లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వం తడిచిన బియ్యం సరఫరా చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు తడిచిన బియ్యంతో కూడిన వీడియోని ట్వీట్ చేశారు. ”సన్నబియ్యం అంటే సన్నగా ఉన్న వ్యక్తిని పౌరసరఫరాల శాఖకి మంత్రిని చెయ్యడం మాత్రమే అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం. నాణ్యమైన బియ్యం అంటే మరీ ఇంత నాణ్యమైనవి అనుకోలేదు. పశువులు కూడా తినలేని బియ్యంలో వైసీపీ మార్కు సంచుల దోపిడీ రూ.750 కోట్లు” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

సన్నబియ్యం గురించి సోషల్ మీడియాలో లోకేష్ చేస్తున్న ప్రచారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. రేషన్ బియ్యం పంపిణీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బియ్యం నాణ్యత ఎలా ఉందన్న దానిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని.. బియ్యం చాలా బాగున్నాయని మంచి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోందన్నారు. నాలుగైదు రోజులగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని.. అన్ని ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన బియ్యాన్ని రవాణా చేస్తున్నామన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కారణంగా 30 బియ్యం సంచులు తడిసిపోయాయని.. వాటి స్ధానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామని మంత్రి నాని వివరించారు. పేదవాళ్లకు ఇంత మంచి జరుగుతుంటే.. తినగలిగే బియ్యాన్నే పంపిణీ చేస్తుంటే.. టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి మండిపడ్డారు. నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.

పలాసలో సీఎం చేతుల మీదుగా నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోందని మంత్రి తెలిపారు.