కొరత లేకుండా : వరదల వల్లే ఇసుక సరఫరాకు అంతరాయం – పెద్దిరెడ్డి

  • Published By: madhu ,Published On : October 13, 2019 / 02:02 AM IST
కొరత లేకుండా : వరదల వల్లే ఇసుక సరఫరాకు అంతరాయం – పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్లు, మైనింగ్‌ అధికారులతో నూతన ఇసుక పాలసీపై అక్టోబర్ 12వ తేదీ శనివారం వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ప్రజలకు ఇసుక వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35 వేల టన్నుల ఇసుక సరఫరా జరుగుతోందని.. దీనిని రోజుకు లక్ష టన్నులకు పెంచాలన్నారు.

మూడు నెలలుగా వరదలు కొనసాగుతుండడంతో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని.. వరదలు తగ్గే వరకు ప్రత్యామ్నాయంగా పట్టాదారు భూముల్లోని ఇసుకపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే ఇసుక తవ్వకాల కోసం జిల్లాల నుంచి పట్టాదారులు దరఖాస్తులు సమర్పిస్తున్నారని.. తక్షణం ఈ దరఖాస్తులను ఆమోదించి.. ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని ఆదేశించారు.

ఇసుక సరఫరాపై జాయింట్ కలెక్టర్‌లకు బాధ్యతలు అప్పగించామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. మొదటి, రెండు, మూడు గ్రేడ్‌లలోని రీచ్‌లలో ట్రాక్టర్లకు అనుమతివ్వాలని.. గ్రామ సచివాలయాల సిబ్బందిని రీచ్‌లవద్ద పెట్టి ఆన్‌లైన్‌ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని అధికారులకు సూచించారు. మైనింగ్‌ అధికారులు, జాయింట్‌ కలెక్టర్‌లతో సమన్వయం చేసుకోవాలని.. ఇసుక లభ్యత వున్న జిల్లాల్లో స్థానికుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సంబంధిత జిల్లా వాసులకు కొంత వరకు ఇసుకను రిజర్వు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
Read More : విషమే పాయసం : 50 ఏళ్లుగా పాములే అతడి ఆహారం