కేసిఆర్ వద్దన్నా కూడా జగన్ చేశారు: మంత్రి నాని

  • Published By: vamsi ,Published On : February 15, 2020 / 03:38 AM IST
కేసిఆర్ వద్దన్నా కూడా జగన్ చేశారు: మంత్రి నాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ సీఎం అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య మంచి సంబంధాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌కు ఆర్టీసీ విలీనం విషయంలో కీలక సూచనలు చేశారట. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ముఖ్యమంత్రి జగన్‌తో చెప్పారని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.

ఆర్టీసీ కార్మికులకు ఇంధన పొదుపు, భద్రత అవార్డులు అందించే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నానీ, కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడాన్ని చాలామంది వ్యతిరేకించారని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం పొరపాటు అని జగన్‌కు తెలంగాణ సీఎం  కేసీఆర్‌ కూడా చెప్పారని పేర్ని నాని అన్నారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు ప్రభుత్వం భరించడం గుదిబండ అని కేసీఆర్‌ అన్నారని, అయితే కేసీఆర్‌ వ్యాఖ్యలను జగన్‌ సవాలుగా తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పుకొచ్చారు.

అలాగే కార్మికుల విషయంలో ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పేర్ని నాని అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో తప్పులున్నాయని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమపై నమ్మకం ఉంచాలని.. ఇక సీపీఎస్‌ రద్దు, ఆర్టీసీ కార్మికులకు పింఛన్‌ డిమాండ్లను సీఎం జగన్ త్వరలోనే నెరవేర్చుతారని హామీ ఇచ్చారు.

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు