అత్తాడివంక వాగులో పడి ఇంటర్  విద్యార్థి గల్లంతు

  • Published By: veegamteam ,Published On : September 20, 2019 / 09:49 AM IST
అత్తాడివంక వాగులో పడి ఇంటర్  విద్యార్థి గల్లంతు

కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో విషాదం నెలకొంది. ఆలమూరులోని అత్తాడి వంకలో పడి ఇంటర్  విద్యార్థి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడ్ని ఎలాగైనా రక్షించాలని వేడుకుంటున్నారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు అత్తాడివంక వాగులో 10మంది రెస్క్యూటీంతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. గ్రామస్థుల సహాయంతో రెస్క్యూటీం గాలింపును కొనసాగిస్తోంది.

తమ కళ్లముందే వరద నీటిలో కొట్టుకుపోతున్న విద్యార్థికి గట్టు మీదనే ఉండి చెట్ల కొమ్మలు పట్టుకోమ్మంటూ గ్రామస్తులు సూచించారు.కానీ వరదనీటి ఉదృతికి సదరు విద్యార్థి కొట్టుకోవటంతో కుమారుడి కోసం తల్లిదండ్రులు విలపిస్తున్నారు.వారి రోదన చూసిన గ్రామస్థులు చలించిపోతున్నారు. అతడిని ఎలాగైనా సరే రక్షించాలని రెస్క్యూటీంతో కలిసి కృషి చేస్తున్నారు.

కాగా గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పోటెత్తుతున్న వరద నీటికి బ్రిడ్జీలు సైతం కొట్టుకుపోయాయి. ప్రమాదస్థాయిలో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. బైటకు వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి వస్తారోలేదోనని భయాందోళనలకు గురవుతున్నారు.