నింగికెగిసిన గంగమ్మ : వాటర్ ఫౌంటేన్ కాదు..మిషన్ భగీరథ పైపులైన్

  • Edited By: madhu , March 31, 2019 / 02:09 AM IST
నింగికెగిసిన గంగమ్మ : వాటర్ ఫౌంటేన్ కాదు..మిషన్ భగీరథ పైపులైన్

తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడక్కడ పైపులు పగిలిపోవడం, లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనితో నీరు బయటకు ఎగజిమ్ముతోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం బండర్ పల్లి వద్ద ఎయిర్ వాల్వు పగిలిన భారీగా నీరు చిమ్మింది. మన్యంకొండ నుంచి నారాయణపేట జిల్లాకు ఈ పైపులైన్ ఏర్పాటు అయ్యింది. మార్చి 30వ తేదీ శనివారం సిమెంట్ కాంక్రీట్ పనులు చేపట్టారు. పనులు చేస్తున్న సమయంలో వాల్వు ఒక్కసారిగా తగిలింది. నీరంతా ఆకాశాన్నంటేలా నీరు ఎగిసింది. 

ఎగజిమ్ముతున్న నీటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో అక్కడకు వచ్చారు. రహదారులపై పోతున్న వారు సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీ పడ్డారు. ఫౌంటేన్ మాదిరిగా నీళ్లు బయటకు ఎగజిమ్మడం, అందులోనూ అధిక పీడనంతో దాదాపు 35 అడుగుల దాక నీళ్లు ఎగసిపడటం చూపరులను ఆకట్టుకుంది. అయితే నీరంతా వృథాగా పోయింది. వెంటనే అధికారులు స్పందించారు. నీటి సరఫరా నిలిపివేసి ఎయిర్ వాల్వుకు రిపేర్ చేశారు.