కొడుకు భవిష్యత్ కోసం : రాజకీయాలకు బొజ్జల గుడ్ బై

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 05:03 AM IST
కొడుకు భవిష్యత్ కోసం : రాజకీయాలకు బొజ్జల గుడ్ బై

చిత్తూరు : శ్రీకాళహస్తి రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయాలకు స్వస్తి చెప్పారు. నియోజకవర్గ బాధ్యతలను కుమారుడు సుధీర్ రెడ్డికి అప్పచెబుతున్నట్లు..అనుచరుల సమావేశంలో జనవరి 18వ తేదీ శుక్రవారం బొజ్జల ప్రకటించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల బరిలో సుధీర్ నిలుస్తాడని ప్రకటించారు. శ్రీకాళహస్తి నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా బొజ్జల గెలిచారు. 
రాజకీయాలకు దూరంగా ఉన్న బొజ్జల…
టీడీపీ ఏర్పాటు నుండి పార్టీలో బొజ్జల కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఏఫీ మంత్రివర్గ విస్తరణలో బాబు..ఆయన్ను పక్కన పెట్టేశారు. అనారోగ్య కారణాలతోనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక అప్పటి నుండి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బొజ్జల ఫ్యామిలీ అలర్ట్ అయ్యింది. వారసుడు సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ బొజ్జల కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. 
వ్యతిరేకిస్తున్న నాయుడు…
ఇక్కడి నుండి పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.సి.వి నాయుడు టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా నెరవేరలేదు. బొజ్జలకు కేటాయించారు. ఈసారి మాత్రం తనకివ్వాలంటూ పట్టబడుతున్నారు. బొజ్జల కుటుంబానికి ఇస్తే మాత్రం తాను పార్టీని వీడేందుకు కూడా వెనుకాడబోనని నాయుడు స్పష్టం చేసినట్లు టాక్. ఒకవేళ బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించకపోతే..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారుతారని మరో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మధుసూధన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరి బొజ్జల తనయుడికి టికెట్ కన్ఫామ్ అవుతుందా ? టీడీపీ నుండి ఒకే కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొజ్జల ఫ్యామిలీని మేలు చేకూరుస్తుందా ? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.