మెగా మల్టీస్టారర్.. 140మంది నటీనటులతో.. అమ్మ కోసం!

10TV Telugu News

కరోనా కారణంగా టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అని లేదు.. ప్రతీ ఇండస్ట్రీ కూడా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుని పోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తుండగా.. ఈ పరిస్థితిలోనే మళయాలం ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప నిర్ణయం తీసుకుంది. . అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) నిర్మాణంలో ఓ మెగా మల్టీస్టారర్ చేయ్యాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ ఓ ప్రకటన చేశారు.

కరోనా కారణంగా ఇబ్బందిపడ్డ సినీ కార్మికులను ఆదుకోవడంలో భాగంగా.. మెగా మల్టీస్టారర్‌ చిత్రం చేసేందుకు రెడీ అయ్యింది మలయాళ చిత్రసీమ. ప్రముఖ మలయాళ దర్శకులు ప్రియదర్శన్, టీకే రాజీవ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో మెగాస్టార్ మోహన్‌ లాల్, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. వీరిద్దరే కాకుండా మలయాళంలో టాప్‌ స్టార్స్‌ అందరూ దాదాపు 140 మంది నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మందికి పని కల్పించాలని, సినిమా ద్వారా వచ్చే మొత్తాన్ని ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులకు ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు.

10TV Telugu News