వరల్డ్ రికార్డ్.. ఒకేసారి 60 దేశాల్లో హనుమాన్ చాలీసా..

  • Published By: nagamani ,Published On : August 17, 2020 / 06:38 PM IST
వరల్డ్ రికార్డ్.. ఒకేసారి 60 దేశాల్లో హనుమాన్ చాలీసా..

ఆగష్టు 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమెరికాలోని సిలికానాంధ్ర సంస్థ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రజలకు మానసిక బలం చేకూర్చాలనే ఉద్ధేశ్యంతో హనుమాన్ చాలీసా లక్ష గళార్చన నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 60 దేశాల నుంచి లక్ష మందికిపైగా హిందు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆన్‌లైన్ ఈవెంట్‌కు ప్రయాగ్రాజ్‌లోని పెద్ద హనుమాన్ ఆలయానికి చెందిన చిన్న మహాంత్ స్వామి ఆనంద్ గిరి నాయకత్వం వహించారు.



సాయి దత్త పీఠం, నాట్స్‌తో పాటు పలు తెలుగు సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో సిలికానాంధ్ర సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్ష మందికిపైగా హనుమాన్ భక్తులు ఒకేసారి హనుమాన్ చాలీసా పఠించారు. కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ఆరెంజ్ మూన్ అధినేత అశోక్ బడ్డి, ఆరెంజ్ మూన్ సాంకేతిక బృంద సమన్వయకర్త హరి దేవబత్తుని ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.



ఈ సందర్భంగా ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యూజెర్సీ సాయిదత్త పీఠం ద్వారా భక్తులను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయడంలో రఘు శర్మ శంకరమంచి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.



కరోనా మహమ్మారిని నుంచి మానవాళిని రక్షించుకునేందుకు.. జరిపే ఈ పోరాటంలో విజయం సాధించడానికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా సాధించాలనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సిలికానాంధ్ర సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి‌లు కొనియాడారు.



ఈ సంఘటనను చారిత్రాత్మకంగా మార్చడానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందాన్ని ఆహ్వానించారు. గిన్నిస్ బుక్ టీమ్ ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించింది. ఆ తరువాత హనుమాన్ సాలీసా సర్టిఫికేట్ కూడా ఇవ్వబడింది. ఈ కార్యక్రమానికి భారత జల విద్యుత్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్, హోంమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కూడా ఆన్‌లైన్‌లో హాజరైనట్లు స్వామి ఆనంద్ గిరి తెలిపారు. కరోనా మహమ్మారి కబంధ హస్తాల్లోంచి ప్రపంచం త్వరలో విముక్తి లభిస్తుందని ఆశించారు. హనుమాన్ చలిసాకు ఆత్మశక్తిని పెంచే శక్తి ఉందని తెలిపారు.