పాలు తాగుతున్న పాలకొల్లు అమ్మవారు 

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 04:33 AM IST
పాలు తాగుతున్న పాలకొల్లు అమ్మవారు 

వినాయకుడు పాలు తాగాడు..సాయిబాబా పాలు తాగుతున్నాడు..అనే వార్తలు  విన్నాం..ఇప్పుడు అమ్మవారు పాలు తాగుతున్నారంటూ భక్తులు తండోప తండాలుగా వచ్చి అమ్మవారికి పాలు తాగిస్తున్నారు. ఈ వింత ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అచ్చుగాట్లపాలెంలో  చోటుచేసుకుంది. 

అచ్చుగాట్ల పాలెంలో కొలువైన ముఖ దారమ్మ అమ్మవారు పాలు తాగుతుందని రెండు రోజులుగా  ప్రచారం జోరందుకుంది. దీంతో భక్తులు అమ్మవారికి పాలు తాగించేందుకు  పెద్ద ఎత్తున బారులు తీరారు. అమ్మవారికి పాలు పట్టిస్తూ తెగ ఆనందపడిపోతున్నారు. ప్రజల కడుపులు నింపే ముగ్గురమ్మల మూలపుటమ్మకు పాలు తాగించే అదృష్టం మాకు కలిగిందంటూ తెగ సంబరపడిపోతున్నారు. అమ్మవారి మహిమలు కళ్లారాచూసామంటూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు.  

కొంతకాలంగా మద్దాల సత్యవతి అనే వృద్ధురాలు షిరిడిలో నివసిస్తోంది. ఆమె ఇటీవల తన స్వగ్రామం అయిన  పాలకొల్లుకు వచ్చింది. ఈ క్రమంలో మద్దాల సత్యవతికి ముఖ దారమ్మ అమ్మవారు కలలోకి వచ్చిందట. రాత్రి కలలోకి వచ్చిన అమ్మవారు సత్యవతితో తనకు పాలు పట్టించమని చెప్పిందట. కానీ సత్యవతి పట్టించుకోలేదట..అదంతా తన భ్రమ అనుకుందట. కానీ మరుసటి ఉదయం సత్యవతి పాలుతాగుతుంటే గ్లాస్ పగిలిపోయిందట. తనకు కలలోకి వచ్చి అమ్మవారు చెప్పిన ఘటనను గుర్తు చేసుకున్న సత్యవతి అమ్మవారికి కోపం రావడం వల్లే ఇలా జరిగిందని భావించింది.

అమ్మా..అపచారం జరిగిపోయింది. ఈ భక్తురాలిని మన్నించు అనుకుంటూ..వెంటనే పాలు పట్టుకుని గుడికి వెళ్లి అమ్మవారికి పాలు పట్టించిందట.అప్పుడు తాను పట్టించిన పాలను అమ్మవారు తాగిందని చెబుతోంది వృద్ధురాలు సత్యవతి. ఇదే విషయాన్ని సత్యవతి అందరికీ చెప్పింది. దీంతో  పెద్దఎత్తున జనం అక్కడకు చేరుకొని అమ్మవారికి పాలు పట్టిస్తున్నారు. ఇది ఆనోటా ఈనోటా ప్రచరం కావటంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి పాలు పట్టిస్తూ ఆనంద పడుతున్నారు.